
ట
నీళ్లలోనే వెయ్యి కాలనీలు
30 వేల మంది నిరాశ్రయులు.. 29 మంది మృతి
ఉప్పొంగిన మూసీ.. తెగిన చెరువులు
వరదలో కొట్టుకుపోయిన లారీలు, కార్లు, టూవీలర్లు
రంగంలోకి ఆర్మీ.. బోట్లతో సహాయక చర్యలు
పలు విమానాలు రద్దు.. మరికొన్ని ఆలస్యం
రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు, నేషనల్ హైవేలు
20 లక్షల ఎకరాల్లో పంట నష్టం
హైదరాబాద్, వెలుగు: రెండు రోజుల్నుంచి ఎడతెరిపి లేకుంట పడ్డ వానలతో హైదరాబాద్‌లో జన జీవనం ఆగమైంది. మూసీ నది, నాలాలు ఉప్పొంగడం, చెరువులు తెగిపోవడంతో వెయ్యికిపైగా కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో వేలాది మంది జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. ఇండ్లపైకప్పుల మీదికి ఎక్కి మంగళవారం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పల్లె రోడ్ల నుంచి నేషనల్ హైవేలదాకా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ చుట్టూ పలుచోట్ల హైవేలు తెగిపోవడంతో జిల్లాల నుంచి రాకపోకలు బంద్ అయ్యాయి. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. లారీలు, కార్లు సహా పెద్ద సంఖ్యలో వెహికల్స్ వరదల్లో కొట్టుకుపోయాయి. వానలతో ఇండ్లు కూలడం, వరదలో కొట్టుకుపోవడం వంటి ఘటనలతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 38 మంది చనిపోయారు. ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 29 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఆర్మీ కూడా రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది నిరాశ్రయులు అయినట్టు ఆఫీసర్లు అంచనా వేశారు. ఇంకా పెద్ద సంఖ్యలో జనం నీట మునిగిన కాలనీల్లో ఉండిపోయారు. ఇందులో హైదరాబాద్ లోనే 20 వేల మందికిపైగా ఉన్నారు. వీరిని సమీపంలోని ఫంక్షన్ హాళ్లు, స్కూళ్లకు తరలించారు. నీళ్లలో కొట్టుకుపోయిన, ఆచూకీ లభించని వారి కోసం మున్సిపల్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది గాలిస్తున్నారు. చెరువులు, కుంటలు, నాలాల సమీపంలోని కాలనీ, బస్తీల్లోకి నీళ్లు చేరాయి. ఇండ్ల నుంచి బయటికి రాలేక జనం ఇబ్బంది పడ్డారు. చంద్రయాణ్‌గుట్ట సమీపంలోని పల్లె చెరువుకట్ట తెగిపోయి ఫలక్‌నుమా పరిసర ప్రాంతాలు, అల్‌జుబైర్ కాలనీల్లో నీళ్లు నిండాయి. సీబీఎస్ నుంచి మలక్‌పేట రేస్ కోర్స్ వరకు మూసీ తీర ప్రాంతంలో ఇండ్లు పూర్తిగా మునిగిపోయాయి. బాధితులు ఇండ్ల పైకి ఎక్కి మంగళవారం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి సాయం కోరారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జిల్లేలగూడ, మీర్‌పేట, అల్మాస్‌గూడలో ఎన్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ చేసింది. స్థానిక పోలీసులతో కలిసి మంత్రాల చెరువు, సంద చెరువు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని కాపాడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. గ్రేటర్ పరిధిలో వెయ్యి కాలనీల్లోకి నీరు చేరిందని అధికారులు అంచనా వేశారు. ఇంకా 150 కాలనీలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. సెల్లార్లలోని నీటిని తోడేందుకు సరిపడా పంపులు లేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో పలు ప్రాంతాల్లో కాలనీ వాసులు అధికారులు, నాయకుల తీరుపై మండిపడ్డారు. బల్కంపేట ఎల్లమ్మ గుడిలోకి భారీగా నీరు చేరింది.
ఎక్కడికక్కడే ట్రాఫిక్ బంద్
వర్షాలు, వరదలతో హైదరాబాద్ సిటీతోపాటు హైవేలపైనా ట్రాఫిక్‌కు తీవ్రంగా ఇబ్బంది ఎదురైంది. దీంతో హైదరాబాద్‌నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలను నిలిపివేశారు. ప్రధానంగా హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై ఇనామ్ గూడ వద్ద వరద నీరు చేరడంతో వెహికల్స్ రోడ్లుపైనే నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల పొడవునా వెహికల్స్ ఆగిపోయాయి. గుంటూరు– హైదరాబాద్ హైవే, కర్నూల్ హైవేలపై ప్రవాహాలతో రోడ్లు గుంతలు పడ్డాయి. ఉప్పల్ లోని నల్ల చెరువు వరద నీటితో రోడ్డు కొట్టుకుపోవడంతో ఉప్పల్– వరంగల్ హైవేపై రాకపోకలు ఆగిపోయాయి. ఎల్బీ నగర్ మీదుగా వాహనాలను మళ్లించారు. సిటీలోని గగన్ పహాడ్ సమీపంలో చెరువు కట్టతెగింది. హైదరాబాద్, -నాగ్‌పూర్ జాతీయ రహదారిపై మనోహరాబాద్ అండర్ పాస్‌లో వరద నీళ్లు చేరడంతో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ సమీపంలో చెరువు తెగిపోవడంతో కర్నూలు నుంచి హైదరాబాద్ కు వచ్చే ట్రాఫిక్ ను ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మళ్లించారు.
సగానికి తగ్గిన బస్సులు
రాష్ట్రంలో కుండపోత వర్షాలతో ఆర్టీసీ అలర్టయింది. బస్సులు నడపడానికి రూట్లు క్లియర్‌గా లేకపోవడంతోపాటు రోడ్లపై వరదలు ఉండటంతో బస్సులను డిపోలకే పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ ఆరు వేల వరకు బస్సులు నడుపుతుండగా.. బుధవారం మూడు వేలలోపే తిప్పారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చే 15 విమానాలను రద్దు చేసినట్టు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.
కొట్టుకుపోయిన 52 కార్లు
వరదల కారణంగా సిటీ చుట్టూ 900 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్టు అధికారులు అంచనా వేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దెబ్బతిన్న కాలనీ, బస్తీ, లింకు రోడ్లను కూడా కలిపితే ఏకంగా 15 వందల కిలోమీటర్లకుపైగా రోడ్లు దెబ్బతిని ఉంటాయని జీహెచ్ఎంసీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్లు, ఇతర వెహికల్స్ వరదల్లో కొట్టుకుపోయాయి. ఇందులో హైదరాబాద్‌లోనే 52కిపైగా కార్లు ఉన్నాయి. ఒక్క గగన్ పహాడ్ ఏరియాలోనే 30కిపైగా కార్లు, ఒక లారీ కొట్టుకుపోగా.. హయత్ నగర్ లోని లష్కర్ గూడ రోడ్‌పై వరదలో 6 కార్లు, గౌస్ నగర్, మీర్ పేట, జిల్లేలగూడలో చెరువు ప్రవాహానికి మరికొన్ని వెహికల్స్కొట్టుకుపోయాయి. రెండు రోజుల్లో సుమారు రూ.300 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
117 ఏండ్ల తర్వాత రికార్డు వర్షపాతం
రెండు రోజులుగా కురిసిన వానలతో హైదరాబాద్ సిటీ మొత్తంగా సగటున 19.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఎప్పుడో 1903వ సంవత్సరంలో ఇంతస్థాయిలో వాన కురిసిందని వివరించారు. సిటీకి సమీపంలో ఉన్న ఘట్కేసర్ లో అయితే ఏకంగా 35 సెంటీమీటర్లు, కీసరలో 27 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.
అలర్ట్‌గా ఉన్నం
“పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి అలర్ట్‌గా ఉంది. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్‌తో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నం. ఫలక్‌నుమా, చాదర్‌ఘట్ ప్రాంతాల్లోని ప్రజలను షెల్టర్ హోమ్స్‌కి షిఫ్ట్ చేస్తున్నం. ప్రజలు అత్యవస రమైతేనే ఇండ్ల నుంచి బయటికి రావాలి. వాన తగ్గాక గంటన్నర తరువాత ట్రావెల్ చేస్తే ఇబ్బందులు ఉండవు. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో సైన్‌బోర్డ్స్‌ను గమనించాలి’’ ‑ అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ