V6 News

ఆరోగ్య తెలంగాణకు గ్లోబల్‌‌‌‌ సమిట్‌‌‌ ఊతం: నోరి దత్తాత్రేయుడు

ఆరోగ్య తెలంగాణకు గ్లోబల్‌‌‌‌ సమిట్‌‌‌ ఊతం: నోరి దత్తాత్రేయుడు
  • ప్రముఖ క్యాన్సర్‌ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు ప్రశంస
  • సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ. లక్షల కోట్ల పెట్టుబడులు
  • ప్రజారోగ్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం 
  • సీఎం రేవంత్​ చేస్తున్న కృషి బాగుంది
  • క్యాన్సర్‌‌‌‌ చికిత్సలో తెలంగాణ గ్లోబల్ లీడర్‌‌‌గా ఎదుగుతుందని ఆశాభావం

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య తెలంగాణకు గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సమిట్‌‌‌‌‌‌‌‌ పెట్టుబడులతో ఊతం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ అద్భుత విజయం సాధించడంపై  హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని అభినందిస్తూ నోరి దత్తాత్రేయుడు ఒక లేఖ రాశారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం ఓ చరిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఇది సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అందిస్తున్న సుస్థిర పాలన, రాష్ట్ర భవిష్యత్తుపై పారిశ్రామికవేత్త లకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని కొనియాడారు. 

ముఖ్యంగా డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌లాంటి అత్యాధునిక రంగాల్లోకి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ వెల్లువలా రావడం ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ సత్తాను చాటిచెబుతున్నదని చెప్పారు. ప్రపంచ వేదికపై తెలంగాణను గట్టి పోటీదారుగా నిలపడంలో ఈ విజన్ దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  తెలంగాణలో ప్రజారోగ్య సంరక్షణ, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు హర్షనీయమని ప్రశంసించారు.