మినీ దావోస్ లా గ్లోబల్ సమిట్.. క్రీడా, సినీ తారల సందడి.. తెలంగాణ రైజింగ్-2047కు ఏర్పాట్లు పూర్తి

మినీ దావోస్ లా   గ్లోబల్ సమిట్.. క్రీడా, సినీ తారల సందడి.. తెలంగాణ రైజింగ్-2047కు ఏర్పాట్లు పూర్తి
  • ఫైవ్ స్టార్ హోటల్స్ సౌకర్యాలతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
  • 3 హెలీప్యాడ్లు, డిస్కషన్ సెషన్ హాల్స్, మోస్ట్​ ఇంపార్టెంట్ పర్సన్స్ కోసం ప్రత్యేక గదులు​
  • ఇయ్యాల డ్రై రన్ నిర్వహణ.. 
  • రేపు గవర్నర్ చేతుల మీదుగా షురూసీఎం, వరల్డ్ ఎకనామిక్ సమిట్ సీఈవోతో పాటు ప్రముఖుల ప్రసంగాలు
  • తెలంగాణ ఔనత్యాన్ని చాటిచెప్పేలా ప్రత్యేకంగా 40 స్టాల్స్​
  • ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్
  • ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సూచన

హైదరాబాద్, వెలుగు: 
తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా, ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఆర్థిక వేదికను తలపించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025’కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా రేపటి నుంచి రెండు రోజుల పాటు (డిసెంబర్ 8, 9) జరగనున్న ఈ సమిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర భవిష్యత్తును సరికొత్తగా ఆవిష్కరించే దిశగా, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌‌‌‌ను ఈ వేదికపై ఆవిష్కరించనున్నారు. 

ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తున్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. శనివారం రాత్రికే ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకోగా, ఆదివారం ఉదయం పూర్తి స్థాయి డ్రై రన్ నిర్వహించి లాజిస్టిక్స్, భద్రతాపరమైన అంశాలను అధికారులు మరోసారి సరిచూసుకోనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వహణ కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించింది. వేదిక వద్ద జర్మన్ -టెంట్ శైలిలో అత్యాధునిక హంగులతో తాత్కాలిక నిర్మాణాలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ అతిథులకు ఏమాత్రం లోటు రాకుండా, వారికి ఫైవ్ స్టార్ హోటల్ అనుభూతిని అందించేలా ప్రత్యేకంగా ‘మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ (ఎంఐపీ) జోన్’ను రూపొందించడం విశేషం. 

ఇక్కడ సీఎంతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సు కోసం ఇప్పటికే 3 హెలిప్యాడ్‌‌‌‌లు సిద్ధం కాగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. సదస్సులో మొత్తం 4 ప్రధాన హాళ్లలో 27 అంశాలపై చర్చా గోష్టులు జరగనున్నాయి. సదస్సుకు హాజరయ్యే అతిథులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన డిజిటల్ మీడియా టన్నెల్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డును లక్ష్యంగా చేసుకుని నిర్వహించనున్న భారీ డ్రోన్ షో ఈ సమిట్​లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నదని అధికారులు వెల్లడించారు.

ప్రముఖుల రాక.. మేధోమథనం.. 27 సెషన్లు

2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి సుమారు 600 మంది వీఐపీలు, 1,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు సదస్సు లాంఛనంగా ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం చేయనున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్​ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా -టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా వంటి అంతర్జాతీయ ప్రముఖులు ప్రసంగించనున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర మంత్రులు కూడా సందేశం ఇవ్వనున్నారు. ఎనర్జీ, ఐటీ, వైద్యం, పర్యాటకం వంటి రంగాలపై 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి.

క్రీడా, సినీ తారల సందడి.. ప్రత్యేక ఆకర్షణలు

కేవలం ఆర్థిక, పారిశ్రామిక అంశాలకే పరిమితం కాకుండా క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతోనూ ప్రత్యేక సెషన్లను నిర్వహించనున్నారు.  ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ పేరుతో జరగనున్న సెషన్‌‌‌‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపిచంద్, దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడాకారులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. అలాగే, వినోద రంగానికి సంబంధించి ‘క్రియేటివ్ సెంచరీ’ పేరుతో జరిగే చర్చలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సుకుమార్, నటుడు రితేశ్ దేశ్‌‌‌‌ముఖ్, నిర్మాతలు గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు పాల్గొంటారు. ఇలా అన్ని రంగాల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌‌‌‌ను విశ్వవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

పటిష్ట భద్రత

సదస్సుకు వేలాదిగా తరలివస్తున్న అతిథులు, వీఐపీల భద్రత దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వేదిక వద్ద దాదాపు 1,200 మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ కమిషనర్ కే శశాంక ఆధ్వర్యంలో 25 ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దాదాపు 2,000 మంది అతిథులు, 2,500 మంది ప్రభుత్వ అధికారులు పాల్గొనే ఈ ఈవెంట్‌‌‌‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 3 వారాలుగా సాగుతున్న సన్నాహాలు నేటితో కొలిక్కి వచ్చాయని, ఈ సదస్సు తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. 

ప్రగతిని చాటేలా 40 స్టాల్స్.. సంక్షేమమే అజెండా

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేండ్లలో సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించేందుకు సదస్సు ప్రాంగణంలో ప్రత్యేకంగా 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి), రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు వంటి పథకాల విజయాలను ఈ స్టాల్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. వీటితో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాల కోసం ప్రత్యేక స్టాళ్లను కేటాయించారు. 
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు ప్రభుత్వ ప్రాధాన్యతలను, పాలనా దక్షతను ఈ స్టాల్స్ కళ్లకు కట్టినట్లు చూపించనున్నాయి.

లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం..వంతారా తరహా జూ పార్క్

ఈ గ్లోబల్ సమిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రెండు రోజుల సదస్సులో దాదాపు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంబానీ గ్రూప్ ఆధ్వర్యంలో గుజరాత్‌‌‌‌లోని ‘వంతారా’ తరహాలో భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ జూ పార్కు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి వంతారా గ్రూప్ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపి, అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఇందుకోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కడ్తల్, కురుమిద్ద ప్రాంతాల్లో దాదాపు వెయ్యి ఎకరాల అటవీ భూమిని కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. అమెరికా, జపాన్, యూకే, యూఏఈ వంటి దేశాల నుంచి వస్తున్న ఇన్వెస్టర్లతోనూ కీలక ఒప్పందాలు జరగనున్నాయి.

ఏర్పాట్లపై అన్ని జాగ్రత్తలు తీసుకోండి: సీఎం రేవంత్ రెడ్డి

అంత‌‌‌‌ర్జాతీయ కంపెనీల‌‌‌‌కు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, ప‌‌‌‌లు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, వివిధ రంగాల‌‌‌‌కు చెందిన ప్రముఖులు సమిట్​కు హాజ‌‌‌‌ర‌‌‌‌వుతున్నందున వారికి స్వాగ‌‌‌‌త ఏర్పాట్లు, వ‌‌‌‌స‌‌‌‌తి, ఇత‌‌‌‌ర స‌‌‌‌దుపాయాల విష‌‌‌‌యంలో త‌‌‌‌గిన జాగ్రత్తలు వ‌‌‌‌హించాల‌‌‌‌ని అధికారుల‌‌‌‌కు సీఎం రేవంత్ సూచించారు. సీటింగ్‌‌‌‌, ఫైర్ సేఫ్టీ, వాహ‌‌‌‌న రాక‌‌‌‌పోక‌‌‌‌లు, ఇంట‌‌‌‌ర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తల‌‌‌‌పై అధికారుల‌‌‌‌ను అడిగి వివ‌‌‌‌రాలు తెలుసుకున్నారు. ప్రతి అంశంపైనా సీఎం అధికారులకు ప‌‌‌‌లు సూచ‌‌‌‌న‌‌‌‌లు చేశారు. ప్రాంగ‌‌‌‌ణం మొత్తాన్ని గంట‌‌‌‌కుపైగా క‌‌‌‌లియ‌‌‌‌తిరిగారు. సీఎం వెంట‌‌‌‌ మంత్రి పొంగులేటి శ్రీ‌‌‌‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు మ‌‌‌‌ల్ రెడ్డి రంగారెడ్డి, కుందూరు జయ్‌‌‌‌వీర్ రెడ్డి త‌‌‌‌దిత‌‌‌‌రులు పాల్గొన్నారు.