గ్లోబరీనాకు టెండర్ వస్తే నాకేం సంబంధం: KTR

గ్లోబరీనాకు టెండర్ వస్తే నాకేం సంబంధం: KTR

‘‘ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన తప్పులకు అందరం బాధపడ్డం. తప్పులకు బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కూడా కోరిన. విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుంటే తండ్రిగా నేనూ బాధపడ్డ. నిన్న ఒకాయన మాట్లాడుతున్నడు.. ఇది పదివేల కోట్ల కుంభకోణమని.. 4 కోట్ల 35 లక్షల టెండర్‌కు ఎవరైనా 10 వేల కోట్ల లంచమిస్తరా? ఆ టెండర్‌ పూర్తిగా ఇంటర్​ బోర్డు పరిధిలోని అంశం. నేను ఐటీ మంత్రిగ ఉన్నప్పుడు.. టెండర్‌ దక్కితే అందుకు నేనెట్ల బాధ్యుడ్ని అవుత..? గ్లోబరీనా టెండర్‌ ప్రక్రియలో తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా అనేది విచారణలో తేలుతది. దీనికి ఐటీ శాఖకు సంబంధం లేదు. విద్యాశాఖ మంత్రి టెండర్ల ప్రక్రియ తర్వాత ఫైల్‌ క్లియర్‌ చేస్తరు. అట్లనే వేరే శాఖల్లో టెండర్లు పిలిచిన్రు. ప్రతిదానికి నాకేం సంబంధం. మాట్లాడేటప్పుడు హద్దు పద్దు ఉండాలె..’’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. కావాలంటె ప్రజల్లోకి రావాలని, తేల్చుకుందామని సవాలు చేశారు. మేడే సందర్భంగా కేటీఆర్​ బుధవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించారు. తర్వాత జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఇంటర్​ అంశంపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.

జీవితాలతో చెలగాటమాడుతున్నారు…

ఇంటర్‌ ఫలితాల్లో తప్పుల పేరుతో ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చుతున్నాయని కేటీఆర్​ విమర్శించారు. ‘‘ఇంటర్‌ విద్యార్థుల ప్రాణాలు, జీవితాలతో చెలగాటమాడుతారా? రాష్ట్రంలో పొలాలు పచ్చబడుతుంటే, రాష్ట్రం పచ్చగా ఉంటే వాళ్ల కండ్లు ఎర్రబడుతున్నయి. తిన్నదరగక వారం పది రోజులుగా ఇంటర్‌ సమస్యను పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నరు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి.. రండి ప్రజల దగ్గరికి వెళ్లి తేల్చుకుందాం. ఇంకో బఫూన్‌ ఉన్నడు.. పెద్దమ్మ గుడికి రా లేకుండా దొంగవి అంటడు. ఎంత చిల్లర రాజకీయం. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లు రమ్మన్నకాడికి వెళ్లకుంటే దొంగలమవుతమా?.. లేని సంస్థలకు నాకు సంబంధం అంటగడుతున్నరు. జవాబుదారీతనం లేకుండా దుర్మార్గంగ వ్యవహరిస్తున్నరు. సమస్య తీవ్రమైనది.. ప్రభుత్వం పరంగా మేం సంయమనంతో వ్యవహరిస్తున్నం. ఇంటర్‌ ఫలితాలతో ప్రభుత్వమేదో డిఫెన్స్‌లో పడ్డది, బురద జల్లాలని చూస్తున్నరు. తప్పు మాట్లాడి నిన్న రాహుల్‌గాంధీ కూడా కోర్టులో క్షమాపణ చెప్పిండు. నా మీద ఆరోపణలు చేస్తున్నవాళ్లు ఇకనన్న తీరు మార్చుకోవాలె. లేకుంటె కోర్టులో పరువునష్టం దావా వేస్త..”అని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ కేవీ దాటికి ఎర్రజెండా పార్టీలకు ఉనికే లేకుండా పోయిందని, ఇప్పుడా పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.

ఓపిక పట్టాలె..

కొందరు టీఆర్​ఎస్, కేసీఆర్​పై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు. ‘‘ఏమన్నా అంటే కత్తులు దూసే కొన్ని మీడియా సంస్థలున్నయి. 24 గంటలు ఇగ ఆ రీల్‌ తిరుగుడె. వాళ్లకూ ఓ అస్త్రం దొరికింది. ఏదో చేస్తం అన్నట్టున్నది వాళ్ల హడావుడి. సమస్య తీవ్రమైందే.. తప్పులు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలె. ప్రభుత్వం అదే పని చేస్తున్నది.మీడియాకు కొంత ఓపిక, సంయమనం అవసరం. కోర్టులో విచారణ కొనసాగుతోంది. తప్పులకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటం..’’అని చెప్పారు. చేతులు జోడించి ఇంటర్‌ స్టూడెంట్లను కోరుతున్నానని, చదువే మొత్తం కాదని, తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ చేయిస్తోందని, తొందరలోనే ఆ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు.

అంగన్​వాడీలు, కార్మికుల వేతనాలు పెంచినం…

రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడమే కాదు, కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అందాలన్నదే సీఎం కేసీఆర్‌ విధానమని కేటీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ కార్మిక పక్షపాతి అని, అంగన్‌వాడీ టీచర్లు, కార్మికుల వేతనాన్ని రెండు సార్లు పెంచారని తెలిపారు. రూ.9 వేలు ఉన్న హోంగార్డుల వేతనాన్ని రూ.21 వేలకు పెంచారని గుర్తు చేశారు. ప్రగతి భవన్‌లోకి ఎవరికీ అనుమతి లేదని ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నాయని, వేలాది మంది కార్మికులను పిలిచి భోజనం పెట్టి, వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌దని చెప్పారు. సింగరేణి కార్మికులకు ఎన్నడూ లేనంత బోనస్​ ఇవ్వడంతో పాటు వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించామన్నారు. మున్సిపల్‌ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచిన కార్మిక పక్షపాతి కేసీఆర్‌ అన్నారు. కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం కార్మిక అనుకూలమైనది కాదని, మే 23న లోక్​సభ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, రాబోయే కొత్త ప్రభుత్వంతో మాట్లాడి నుంచి కావాల్సిన పరిష్కారాలు చూపిస్తామని పేర్కొన్నారు.