
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కర్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి వివాదాస్పద కామెంట్లు చేసిన మధ్యప్రదేశ్ గిరిజన మంత్రి విజయ్‌షాను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోద్యంయోగ్యంకానివని, అనుచితమైనవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. వెంటనే హైకోర్టుకు వెళ్లి క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. రాజ్యాంగ పదవులను కలిగి ఉన్నవాళ్లు ప్రసంగాలు చేసేటప్పుడు సంయమనం పాటించాలని సూచించారు. మీరు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో తెలుస్తోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ విజయ్ షా దాఖలు చేసిన అప్పీల్‌ను తిరస్కరించారు. ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను నిలిపివేయడానికి కూడా జస్టిస్ గవాయ్ నిరాకరించారు.