సీఎం చెప్పి నెలయినా జీవో విడుదల చెయ్యలే

సీఎం చెప్పి నెలయినా జీవో విడుదల చెయ్యలే
  •     డ్యూటీలోకి తీసుకుంటామని అసెంబ్లీలో సీఎం ప్రకటన
  •     నెల రోజులు కావొస్తున్నా జీవో విడుదల కాలే
  •     ఫీల్డ్ అసిస్టెంట్స్ లేకపోవటంతో సెక్రటరీలపై పనిభారం

హైదరాబాద్, వెలుగు:“ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటున్నం. వారిని తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరుతున్నరు. వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకుంటం” అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. అయితే ముఖ్యమంత్రి ప్రకటన చేసి నెల కావొస్తున్నా.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే అంశంపై ఇంత వరకు సర్కారు జీవో విడుదల చెయ్యలేదు. దీంతో సుమారు 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. సమ్మె చేసిన కారణంగా 2020లో ప్రభుత్వం వీరిని విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. మరోవైపు వేసవి స్టార్ట్ కావటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి పనులు వేగంగా జరుగుతున్నాయి. సర్కారు ఉత్తర్వులిస్తే వెంటనే విధుల్లో చేని పనులను సమన్వయం చేసుకుంటామని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు.

సెక్రటరీలపై పనిభారం

రెండేండ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవటంతో 12,761 గ్రామాల్లో పనిచేస్తున్న సెక్రటరీలపై తీవ్రమైన పనిభారం పడుతోంది. గ్రామంలోని కూలీల్లో కనీసం 50 శాతం మంది పనులకు హాజరుకావాలని సెక్రటరీలపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కూలీల హాజరును పరిశీలించే అసిస్టెంట్లు లేకపోవటంతో సెక్రటరీలకు ఆ పని అప్పగించారు. కూలీలను తీసుకొచ్చే బాధ్యతను కూడా వారే చూస్తున్నారు. ఉపాధి హామీ పనుల నుంచి తమకు విముక్తి కల్పించాలని మంత్రులు, అధికారులను సెక్రటరీలు కోరుతున్నారు.

ఖాళీలు భర్తీ చేయాలె

2018లో రాష్ట్ర ప్రభుత్వం 4,500 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,761 పంచాయతీలు ఉండగా 7,600 మంది మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. కొత్త జీపీలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించకపోవటంతో రెండు, మూడు గ్రామాల బాధ్యతలను ఒక్కరికే అప్పగిస్తున్నారు. కొత్త జీపీలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమిస్తే వీరిపై పనిభారం తగ్గుతుంది.

పెరుగుతున్న ఉపాధి పని రోజులు

దేశంలో ఉపాధి హామీలో ఎక్కువ పని రోజులు కల్పిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. 2014లో 10 కోట్ల 39 లక్షల పని రోజులు కల్పించగా, 2021-‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22లో 14 కోట్ల 40 లక్షల పని దినాలను కల్పించారు. ఇందుకోసం గతేడాదిలో రూ.4,080 కోట్లను ఖర్చు చేశారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించటానికి ఉపాధి పనులు ఉపయోగపడుతున్నాయి. ఒక్కో కూలికి సగటున రూ.172 చెల్లిస్తున్నారు. జాబ్ కార్డు ఉన్న కుటుంబాల్లో సగటున 49 రోజులు
 ఉపాధి కల్పించారు.

ఉత్తర్వులు ఇవ్వండి

రెండేండ్ల నుంచి ఖాళీగా ఉన్నం. సీఎం ప్రకటన చేసి నెల కావొస్తున్నా ఉత్తర్వులు ఇవ్వలేదు. గ్రామాల్లో ఉపాధి పనులు మొదలయ్యాయి. ఉత్తర్వులు ఇస్తే వెంటనే విధుల్లో చేరి పనులను సమన్వయం చేసుకుంటాం. అలాగే రెండేండ్ల జీతం ఇవ్వాలి. 30 శాతం జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నం. 
- భాగ్యలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్, 
యాదాద్రి భువనగిరి జిల్లా