కరోనా సేఫ్టీకి మల్టీ మాస్క్‌‌.. ఆకట్టుకుంటున్న డిజైన్

కరోనా సేఫ్టీకి మల్టీ మాస్క్‌‌.. ఆకట్టుకుంటున్న డిజైన్

పనాజీ: కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బీభత్సం కొనసాగుతూనే ఉంది. మన దేశంలో కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీ స్థాయిలో హెచ్చుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్‌, శానిటైజర్స్‌ను వాడటం తప్పనిసరిగా మారింది. ఎక్కడికి వెళ్లినా మాస్కు మస్ట్‌. దీంతో గోవాకు చెందిన ఒక డిజైనర్ స్పెషల్ మాస్కును తయారు చేశాడు. కరోనా నుంచి పూర్తి రక్షణకు కల్పించడానికి వీలుగా మాస్కును రూపొందించాడు. ఫేస్‌ షీల్డ్‌ ప్రోటోటైప్‌గా ఉండే ఈ మాస్కులో ఒకే సింగిల్ స్ట్రిప్‌ ఉంటుంది. లోపలి నుంచి మాస్కు బిగించి ఉంటుంది. మాస్కుపై ఫేస్‌ షీల్డ్ అమరి ఉంటుంది. ఇది వాడటానికి చాలా కంఫర్టబుల్‌గా ఉండటం గమనార్హం. సౌత్‌ గోవాకు చెందిన దీపక్ పథానియా అనే డిజైనర్ దీన్ని రూపొందించాడు. భవిష్యత్ మాస్కు అవసరాలకు ఇది సూపర్బ్‌గా సరిపోతుందని, దీన్ని మల్టీ మాస్క్‌గా దీపక్ అభివర్ణించాడు.

‘అవసరమైనప్పుడల్లా మాస్కుపై ఫేస్ షీల్డ్‌ సులువుగా జారిపోతుంది. మాస్కులోని అన్ని భాగాలను సులువుగా కడగొచ్చు. తద్వారా బయో వేస్ట్‌ను తగ్గించొచ్చు. భవిష్యత్‌లో ఈ మాస్కును ఎలక్ట్రానిక్ ఫిల్టర్, ఆడియో లేదా వీడియో రికార్డింగ్ లాంటి వాటితో కస్టమైజ్ చేయొచ్చు’ అని పథానియా చెప్పారు. ఈ మాస్కు డిజైన్‌కు ఫైనల్ ఫినిషింగ్ ఇవ్వడానికి పూణేకి చెందిన ఓ డిజైన్ కంపెనీతో కలసి ఆయన పని చేస్తున్నారు. ఇలాంటి తరహా మాస్కు ప్రపంచంలో మరెక్కడైనా తయారు చేశారేమోనని తెలుసుకునే యత్నాల్లో ఉన్న పథారియా.. దీని పేటెంట్‌ కోసం ట్రై చేయాలని భావిస్తున్నారు.