హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పాడి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో సెర్ఫ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, త్వరలోనే పూర్తిస్థాయిలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు.రాష్ట్రంలో పాల ఉత్పత్తి క్రమంగా పెరుగుతోందని మంత్రి వెల్లడించారు. 2024–25లో 59.35 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2025–26 నాటికి 61.75 లక్షల టన్నులకు చేరిందని తెలిపారు. కర్నాటకలోని నందిని డెయిరీతో పోలిస్తే మన రాష్ట్రంలో విజయ డెయిరీ ద్వారా పాడి రైతులకు అత్యధిక ధరలు ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి బర్రె పాలకు ప్రతి కిలో వెన్నకు రూ.914, ఆవు పాలకు ప్రతి కిలో వెన్నతో పాటు మొత్తం ఘనపదార్థాల ప్రాతిపదికన రూ.340 చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు.
100 వెటర్నరీ డాక్టర్, 304 అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తాం
పశు వైద్య రంగాన్ని పటిష్టం చేసేందుకు శాఖలో కొత్తగా 100 వెటర్నరీ డాక్టర్, 304 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఎనిమిదేళ్ల తర్వాత 1,100 మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న గోపాల మిత్రలకు మెడిక్లెయిమ్, వ్యక్తిగత ప్రమాద బీమా, సకాలంలో గౌరవ వేతనం అందిస్తున్నామని చెప్పారు. అంతకుముందు చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యేలు పట్లోళ్ల సంజీవ రెడ్డి, గండ్ర సత్యానారాయణ రావు, వంశీ కృష్ణ, వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది లీటర్ల పాలు దిగుమతి అవుతున్నాయని, స్వచ్ఛమైన పాల కొరత తీర్చేందుకు సబ్సిడీ బర్రెలు అందించాలని కోరారు. లింపి వ్యాధి నివారణకు వ్యాక్సిన్లు వేయాలని, విజయ డైరీ బిల్లులు సకాలంలో చెల్లించాలని
విజ్ఞప్తి చేశారు.
