ప్రజా సేవ కోసం.. ఆ దేవుడే నన్ను పంపిండు: మోదీ

ప్రజా సేవ కోసం.. ఆ దేవుడే నన్ను పంపిండు: మోదీ
  • నాకు ఇద్దరు దేవుళ్లు.. ఒకరు భగవంతుడు, మరొకరు దేశ ప్రజలు: మోదీ
  • వారసత్వ ఆస్తిపై పన్ను వేసుడు పరిష్కారం కాదు ప్రమాదకరం
  • రాజ్యాంగం ప్రకారం మైనార్టీల సంపద పంచలేరు
  • మిగిలినవారి సంపద పంచితే మతసామరస్యం ఉండదు  
  • ప్రభుత్వం మీ సంపదను పంచుతామంటే.. ఊరుకుంటరా? 
  • ప్రతిపక్షాలు గెలవలేకే.. నియంతృత్వం అంటున్నరు 
  • నేషనల్​ మీడియా ఇంటర్వ్యూలో ప్రధాని కామెంట్స్

న్యూఢిల్లీ: ప్రజా సేవ కోసం ఆ దేవుడే తనను పంపించాడని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సర్వ శక్తిమంతుడు అయిన ఆ దేవుడు.. ప్రజలకు సేవ చేయటం కోసమే నన్ను పంపించాడు. లేకపోతే నాకు ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?” అని చెప్పారు. ‘‘నాకు ఇద్దరు దేవుళ్లు.. ఒకరు కనిపించని సర్వ శక్తిమంతుడు అయిన భగవంతుడు.. మరొకరు140 కోట్ల మంది ప్రజలు. ఈ ప్రజలకు సేవ చేయడానికి నాకు ఇంత శక్తిని ఆ దేవుడు ఇస్తే.. నిరంతరం లక్ష్యం కోసం పని చేయటానికి ఈ ప్రజలే నాకు శక్తినిస్తున్నారు” అని ఆయన తెలిపారు. జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పలు అంశాలపై మాట్లాడారు. తాను కఠినమైన నిర్ణయాలు తీసుకోనని, సరైన నిర్ణయాలే తీసుకుంటానని చమత్కరించారు. కఠినమైన సమయాల్లో నిర్ణయాలు తీసుకునే శక్తిని తనకు ఆ దేవుడే ప్రసాదించాడన్నారు. తనకు ఈ దృఢ సంకల్పం దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పారు. ‘రాజకీయ నేపథ్యంలేని ఓ పేద కుటుంబంలో పుట్టిన నేను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిని కావడం ఏమిటీ? ఇది నిజంగా కొన్ని సార్లు వింతగా అనిపిస్తుంది” అని మోదీ అన్నారు.

సంపద పంచుతామనడం ప్రమాదకరం 

వారసత్వ పన్ను విధానం ద్వారా సంపదను పున:పంపిణీ చేస్తామని కాంగ్రెస్ అంటోందని.. కానీ ఇది ‘పరిష్కారాల పేరిట తెచ్చే ప్రమాదకర సమస్యల’కు దారి తీస్తుందని మోదీ అన్నారు. ‘‘మీ సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పంపిణీ చేస్తుందని అంటే.. మీరు డే అండ్ నైట్ కష్టపడి పని చేస్తరా?” అని ఆయన ప్రశ్నించారు. వెల్త్ ట్యాక్స్ అనేది స్టార్టప్​లను అంతం చేస్తుందన్నారు. నిజానికి ఇవి తమ ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్షం చేస్తున్న చర్యలన్నారు. అసమానతలను రూపుమాపేందుకు ఇవి ఏ రకంగానూ మంచి పరిష్కారాలు కావన్నారు. నిజంగా ప్రజల అభివృద్ధిని కోరుకుంటే వారికి ఉన్న అడ్డంకులను తొలగించి, సాధికారత దిశగా నడిపించడమే మంచిదన్నారు. సంపద పున:పంపిణీ అనేది పేదరికాన్ని తొలగించలేదని, అది ఎన్నటికీ సక్సెస్ కాలేదన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్​ రాహుల్​ను ఆయన ‘యువరాజు’ అంటూ అభివర్ణించారు. ఆయన మాటలు మావోయిస్టు ఐడియాలజీలా కన్పిస్తున్నాయని విమర్శించారు. ‘‘మన రాజ్యాంగం మైనార్టీలందరి ఆస్తులకు రక్షణ కల్పిస్తుంది. అంటే.. సంపదను పున:పంపిణీ చేయాలంటే మైనార్టీల ఆస్తులను కాంగ్రెస్ టచ్ చేయదు. మిగతా మతాలవారి ఆస్తులను పంపిణీ చేస్తారు. అప్పుడు దేశంలో మతసామరస్యం దెబ్బతింటుంది” అని మోదీ చెప్పారు. 

ప్రతిపక్షాలు గెలవలేకపోతే.. నియంతృత్వమా? 

మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, దేశానికి ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్న ప్రతిపక్షాల కామెంట్లనూ మోదీ ఖండించారు. ‘‘యువరాజు అధికారంలోకి రానంత మాత్రాన ఇండియా నియంతృత్వ దేశం (ఎలక్టోరల్ ఆటోక్రసీ)గా మారిపోదు. అధికారంలోకి రాలేకపోతున్నందుకే ప్రపంచ వేదికలపై అబద్ధాలతో ఇండియా ప్రతిష్టను దిగజార్చేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యేలా బీజేపీ ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్ కామెంట్లపై ఆయన స్పందిస్తూ.. నిజానికి కాంగ్రెస్సే మతపరంగా రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. కర్నాటకలో ముస్లింలకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు ఇచ్చారని, ఇప్పుడు తెలంగాణలో దీనిని అమలు చేస్తారన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై స్పందిస్తూ.. ఇకపై ఏ రాజకీయ నాయకుడూ ఇలా నైతిక విలువలు కోల్పోయి జైలు పాలు కాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు.  

ఈవీఎంలపై సుప్రీం తీర్పే దీటైన జవాబు 

లోక్ సభ ఎన్నికల్లో తాను ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని, తమకు 400 ఎంపీ సీట్లు దాటుతాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు టార్గెట్​గా పెట్టుకున్నారనే  విమర్శలను ఖండించారు. కాంగ్రెస్సే రాజ్యాంగాన్ని చాలాసార్లు మార్చిందన్నారు.

మతపరమైన రిజర్వేషన్లకుకాంగ్రెస్​ ప్లాన్​: ప్రధాని

బాగల్​కోట్​(కర్నాటక): దేశంలో మతపరమైన రిజర్వేషన్లు తెచ్చేందుకు కాంగ్రెస్​ ప్లాన్​ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్​ ఇదంతా చేస్తోందని, కానీ దీనిని తాను జరగనివ్వబోనని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు బీజేపీ వెంట ఉన్నందున మైనార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్​ ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిపారు.  కర్నాటకలోని బాగల్​కోట్​ పట్టణంలో సోమవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చేందుకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను లాక్కునేందుకు కర్నాటకలో కాంగ్రెస్​ ప్రచారం ప్రారంభించింది. మతపరమైన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అంగీకరించదు. కానీ కర్నాటక సర్కారు ఓబీసీ రిజర్వేషన్లలో కొంతభాగాన్ని ముస్లింలకు ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు. వారి ఓటుబ్యాంకును సురక్షితంగా ఉంచేందుకు బాబా సాహెబ్​ అంబేద్కర్​ కల్పించిన మీ హక్కులను హరిస్తున్నారని చెప్పారు. మీ హక్కులు, రిజర్వేషన్లు కాపాడేందుకు తాను ఎంతకైనా తెగిస్తానని తెలిపారు. సోషల్ ​మీడియాలో వచ్చే సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని, వివిధ ప్లాట్​ఫామ్​లో వచ్చే సందేశాలను వెరిఫై చేసుకున్నాకే ఫార్వర్డ్ చేయాలని ప్రజలకు మోదీ సూచించారు. కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ను దుర్వినియోగం చేసి, తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి సోషల్ ​మీడియాలో పెడుతున్నారని, అలాంటి ఫేక్ వీడియోలపై పోలీసులకుగానీ, బీజేపీ నాయకులకుగానీ సమాచారం ఇవ్వాలని కోరారు. 

 ఇది నయా భారత్​..ఎవ్వరికీ భయపడదు

దేశంలోని అమాయక ప్రజలను చంపాలని చూస్తున్న ఉగ్రవాదులను మోదీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇది నయాభారత్​ అని, ఎవ్వరికీ భయపడదని, శత్రువుల స్థావరాల్లోకి చొచ్చుకొని వచ్చి దాడిచేస్తుందని చెప్పారు.  వెనుకనుంచి దాడిచేసే స్వభావం తనదికాదని, ఏదైనా ఫేస్​ టు ఫేస్​ ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.