సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. మే 8న సినిమా విడుదల కానుండగా, సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రాజు అనే సాధారణ ఆటో డ్రైవర్ (సుమంత్ ప్రభాస్), అతని ఆటోలో ప్రతిరోజూ ప్రయాణించే కాలేజ్ అమ్మాయి మాయ (నిధి ప్రదీప్) మధ్య సాగే ప్రేమకథగా దీన్ని చూపించారు.
వీరి ప్రేమకు మాయ తండ్రి అనుమతి పొందడం రాజుకు పెద్ద సవాలుగా మారుతుంది. దీంతో వారి ప్రేమ ఒక ఎమోషనల్ ఫైట్‌గా మారుతుంది. ప్రేమ కథతో పాటు, తండ్రి-కూతురు ఎమోషన్ హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ ‘నేను పుట్టి పెరిగింది తెలంగాణ. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గోదారి యాస నేర్చుకుని మాట్లాడాను.
ఈ సినిమాలో ఉన్నదే మన జీవితంలో ఉంటుంది. ఇది పూర్తిగా అందరికీ రిలేట్ అయ్యే సినిమా. గోదావరిలో పడితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మా ‘గోదారి గట్టుపైన’ ప్రేమలో పడితే బయటకు రావడం కష్టం. అంతగా మీరు సినిమాను ప్రేమిస్తారు. ఈ సమ్మర్‌లో సినిమా అందరికీ కూల్ వైబ్ ఇస్తుంది’ అని చెప్పాడు. ఇదొక నీట్ అండ్ క్లీన్ ఫిల్మ్ అని నిధి ప్రదీప్ చెప్పింది.
డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ ‘తరాలు మారినా ప్రేమ మాత్రం మారదు. ఇందులో ప్రేమికుల ప్రేమతో పాటు తండ్రి-కూతురు ప్రేమను చూపించాం. ఈ చిత్రం వేసవిలో ఒక చలివేంద్రంలాంటిది’ అని అన్నాడు. సినిమా అవుట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నామని నిర్మాత అభినవ్ రావు అన్నారు. నటులు రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు.

