డీపీఆర్‌‌లు ఇచ్చేవరకూ ప్రాజెక్టులు ఆపండి

డీపీఆర్‌‌లు ఇచ్చేవరకూ ప్రాజెక్టులు ఆపండి

తెలంగాణకు గోదావరి బోర్డు ఆదేశం
జూన్​ 10లోగా పూర్తి డీపీఆర్‌‌లు ఇవ్వాలని ఏపీ, తెలంగాణకు సూచన
టెలిమెట్రీ స్టేషన్ల గుర్తింపునకు టెక్నికల్‌‌ కమిటీ ఏర్పాటు
పెద్దవాగు మోడ్రనైజేషన్‌‌కు రెండు రాష్ట్రాల అంగీకారం

హైదరాబాద్‌‌, వెలుగు: డీటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్(​డీపీఆర్‌‌)లు ఇచ్చేవరకు ప్రాజెక్టుల పనులు ఆపాలని గోదావరి రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు(జీఆర్ఎంబీ) తెలంగాణను ఆదేశించింది. ఈ నెల పదిలోగా డీపీఆర్‌‌ల ఒకటి, రెండు వాల్యూమ్స్‌‌ అయినా బోర్డుకు సమర్పించాలని, కొంత టైం తీసుకుని మిగతా డీపీఆర్‌‌లు ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది. శుక్రవారం జలసౌధలో జీఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ చంద్రశేఖర్‌‌ అయ్యర్‌‌ అధ్యక్షతన బోర్డు ఎనిమిదో మీటింగ్‌‌ నిర్వహించారు. తెలంగాణ ఇరిగేషన్‌‌ సెక్రటరీ రజత్‌‌కుమార్‌‌, ఏపీ జలవనరుల శాఖ స్పెషల్‌‌ సీఎస్‌‌ ఆదిత్యనాథ్‌‌దాస్‌‌, ఈఎన్సీలు మురళీధర్‌‌, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

2014 తర్వాత ఒక్క కొత్త ప్రాజెక్టు నిర్మించలేదు

2014 జూన్‌‌ 2 తర్వాత తెలంగాణలో ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా నిర్మించలేదని, కాళేశ్వరం ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుగా గుర్తిస్తూ కేంద్రమే లేఖ రాసిందని, సీడబ్ల్యూసీ, హైడ్రాలజీ, ఫారెస్ట్‌‌ సహా అన్ని రకాల క్లియరెన్స్‌‌లు వచ్చాయని తెలంగాణ స్పష్టం చేసింది. కేంద్రం పాత ప్రాజెక్టుగా గుర్తించినపుడు మళ్లీ ఎలా కంప్లైంట్‌‌ చేస్తారని ప్రశ్నించారు. సీతారామ, దేవాదుల ఫేజ్‌‌-3, తుపాకులగూడెం, లోయర్‌‌ పెన్‌‌గంగా సహా మిగతా బ్యారేజీలన్నీ పాత ప్రాజెక్టులేనని, వాటి డీపీఆర్‌‌లను ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. ఏపీ అధికారులు జోక్యం చేసుకుని అన్ని ప్రాజెక్టులను తెలంగాణ ఏర్పడిన తర్వాతే చేపట్టారని, వాటివల్ల దిగువ రాష్ట్రంగా తమకు నష్టం కలుగుతోందని వాదించారు. ఏపీ తీరుపై తెలంగాణ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల వివరాలన్నీ సమగ్రంగా ఇచ్చిన తర్వాత కూడా ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణకు గోదావరిలో 967 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయని 2013 ఫిబ్రవరిలో అప్పటి సీఎం కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి ప్రజంటేషన్‌‌ ఇచ్చారని, ఆ నీటిని రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునే అధికారం తెలంగాణకు ఉంటుందన్నారు.

డీపీఆర్​లు అడిగే హక్కు ఏపీకి లేదు

బచావత్​ అవార్డు ప్రకారమే తెలంగాణ ప్రాజెక్టులను నిర్మిస్తోందని, 2014 జూన్‌‌ 2కు ముందు పూర్తయిన ప్రాజెక్టుల డీపీఆర్‌‌లను అడిగే హక్కు ఏపీకి లేదని ఇంజనీర్లు తేల్చిచెప్పారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటిని మళ్లిస్తున్నారని, వాటికి బదులుగా 45 టీఎంసీల నీళ్లు కృష్ణాలో తెలంగాణకు కేటాయించాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో బోర్డు జోక్యం చేసుకొని ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీటిని తీసుకుంటున్నారనే లెక్కలు బోర్డు వద్ద లేవని, డీపీఆర్‌‌లు ఇస్తే తమకు క్లారిటీ రావడంతో పాటు కేంద్ర జలశక్తి శాఖకు ఆ వివరాలు అందజేస్తామన్నారు. గోదావరిలో నీళ్లను ఏపీ, తెలంగాణ ఏ మేరకు వాడుకున్నాయో గుర్తించేందుకు టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు టెక్నికల్‌‌ కమిటీని నియమించాలని నిర్ణయించారు. బోర్డు మెంబర్‌‌ అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీలో సీడబ్ల్యూసీ, సీడబ్ల్యూపీఆర్‌‌ఎస్‌‌ – పూణే, తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కో సభ్యు డు ఉంటారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో చేపట్టే పెద్దవాగు మోడ్రనైజేషన్‌‌కు రెండు రాష్ట్రాలు ఓకే చెప్పాయి. అపెక్స్‌‌ సమావేశం కోసం వెంటనే రెండు రాష్ట్రాలు ఎజెండాను అందజేయాలని బోర్డు చైర్మన్ సూచించారు.

జీఆర్‌‌ఎంబీ టెక్నికల్‌‌ అడ్వైజరీ బోర్డు మాత్రమే: రజత్‌‌కుమార్‌‌

జీఆర్‌‌ఎంబీ టెక్నికల్‌‌ అడ్వైజరీ బోర్డు మాత్రమేనని, కేంద్ర జలశక్తి శాఖకు సమాచారం పంపడమే దాని బాధ్యత అని ఇరిగేషన్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ రజత్‌‌కుమార్‌‌ అన్నారు. ప్రభుత్వం కష్టపడి, డబ్బులు పెట్టి ప్రాజెక్టులు కడుతుంటే వాటిని ఆపమనడం సరికాదన్నారు. బచావత్‌‌ అవార్డులో కేటాయింపుల మేరకు ఏపీ నీటిని తీసుకోవచ్చన్నారు. రైతులకు నీళ్లు ఇచ్చేందుకే లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులు చేపట్టామన్నారు. జీఆర్‌‌ఎంబీ మీటింగ్‌‌పై స్పందించేందుకు ఏపీ స్పెషల్‌‌ సీఎస్‌‌ ఆదిత్యనాథ్‌‌ దాస్‌‌ నిరాకరించారు. బోర్డు ఏం చెప్తుందో అదే తమ వాదనన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్