
- మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన ఆఫీసర్లు
- ఎటపాక కరకట్ట స్లూయిజ్‌ల నుంచి భద్రాచలంలోకి చేరుతున్న వరద
- ముంపు ప్రాంతాల నుంచి 104 ఫ్యామిలీలను పునరావాస కేంద్రాలకు తరలింపు
భద్రాచలం, వెలుగు : వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు గోదావరి తీరంలో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో గోదావరి ప్రవాహం భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ ఏడాది తొలిసారిగా శనివారం సాయంత్రం 4.16 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశార. కాగా శనివారం రాత్రి వరకు గోదావరి నీటి మట్టం 54 అడుగుల వరకు చేరుకొని నిలకడగా మారుతుందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ ఆఫీసర్లు చెబుతున్నారు. భద్రాచలం ఎగువన ఉన్న కాళేశ్వరం, పేరూరు, ఏటూరునాగారం పరివాహక ప్రాంతంలో గోదావరి తగ్గుముఖం పట్టింది. చర్ల మండలం తాలిపేరు, దుమ్ముగూడెం కాటన్ దొర ఆనకట్ట వద్ద మాత్రమే వరద కొద్దిగా పెరుగుతోంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.
పునరావాస కేంద్రాలకు 346 మంది...
ఆంధ్రాలో విలీనమైన ఎటపాక వద్ద కరకట్ట స్లూయిజ్‌ల నుంచి లీకైన వరద నీరు భద్రాచలంలోని అశోక్‌నగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీల్లోకి చేరుతోంది. దీంతో ఇక్కడి నుంచి 94 కుటుంబాలకు చెందిన 206 మందిని ముందస్తుగా నన్నపనేని మోహన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. బూర్గంపాడు మండల కేంద్రంలో మూడు కుటుంబాలకు చెందిన 11 మందిని, నాగినేనిప్రోలు రెడ్డిపాలెంకు చెందిన రెండు కుటుంబాల్లోని 9 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దుమ్ముగూడెం మండలంలో ఐదు కుటుంబాలకు చెందిన 20 మందిని మొత్తంగా 104 కుటుంబాలకు చెందిన 346 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా భద్రాచలం ఆర్డీవో దామోదర్ వెల్లడించారు. కలెక్టర్ జితేశ్ వి. పాటిల్, ఆర్డీవో దామోదర్‌లు అశోక్‌నగర్ కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీల్లో పర్యటించి స్లూయిజ్‌ల నుంచి వచ్చిన వరదను మోటార్ల ద్వారా ఎత్తిపోయిస్తున్నారు. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లాలో...
వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో పది రోజులుగా వర్షాలు వదలడం లేదు. పగలు ముసురు, రాత్రుళ్లు భారీ వర్షాలు పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కంకలవాగు, పాలెం వాగు, జిన్నెల వాగు, పెంక వాగు, రాళ్ల వాగు, రేగు మడుగు, బొగత జలపాతం ఉదృతంగా పారుతోంది. ఎగువన నుంచి భారీ స్థాయిలో వరద వస్తుండడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం ఉదయం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 17.670 మీటర్లకు చేరుకుంది. ఓ వైపు గోదావరి వరద, మరో వైపు భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వెంకటాపురం మండలంలో టేకులబోరు – పాత్రపురం గ్రామాల మధ్య బల్లకట్టు వంతెన, పాలెం – వీరభద్రవరం గ్రామాల మధ్య కుక్కతోగు వంతెన, బోధపురం కొండాపురం గ్రామాల మధ్య జిన్నేల వాగు వంతెన వద్దకు గోదావరి నీరు చేరింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి భద్రాచలం – వెంకటాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నది పోటు మీద ఉండడంతో గ్రామాలను వరద నీరు కమ్మేస్తోంది. పాత్రపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామం, తిప్పాపురం పంచాయతీ కలిపాక, పెంకవాగు, తిప్పాపురం, సీతారాంపురం గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.