కేంద్రం మెట్టు దిగినా ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టమే

కేంద్రం మెట్టు దిగినా ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టమే

 

  •     తమ నీళ్లు మళ్లించేందుకు ఒప్పుకోని చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌
  •     మిగులు నీళ్లే లేవని చెప్తున్న ఏపీ, తెలంగాణ
  •     ప్రాజెక్టు ఖర్చులో 40% భరించేందుకు ఒప్పుకోని రాష్ట్రాలు


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గోదావరి – కావేరి లింక్‌‌‌‌ ప్రాజెక్టును సవాలక్ష సమస్యలు వెంటాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌‌‌‌లోనే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినా.. నీటి లభ్యత సహా ఇతర అంశాలపై ఒక మెట్టు దిగివచ్చినా పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తున్నది. గోదావరిలో మిగులు జలాలే లేవని ఏపీ, తెలంగాణ తేల్చిచెప్తున్నాయి. ఒకవేళ లింక్‌‌‌‌ ప్రాజెక్టు చేపట్టినా తమకు ప్రయోజనం చేకూర్చేలా పోలవరం నుంచే చేపట్టాలని ఏపీ డిమాండ్‌‌‌‌ చేస్తున్నది. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ వినియోగించుకోకుండా మిగిలిన నీటితోనే లింక్‌‌‌‌ ప్రాజెక్టు చేపట్టాలన్న ప్రతిపాదనపై చత్తీస్​గఢ్​ గుర్రుగా ఉంది. తమ వాటా నీటిని మళ్లించడానికి ఒప్పుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రాష్ట్రాలు 40 శాతం వాటా భరించాలన్న ప్రతిపాదనకూ రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. ఇన్ని సమస్యలను అధిగమించి గోదావరి – కావేరి లింక్​ ప్రాజెక్టు చేపట్టడం కష్టంగానే కనిపిస్తున్నది.

4 నదులు కలిపేందుకు..

చెన్నై మహా నగర తాగునీటి సమస్యతోపాటు తమిళనాడులోని కావేరి ఆయకట్టుకు నీళ్లివ్వడానికి, ఏపీ, తెలంగాణలోని 3 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి నదుల అనుసంధానానికి సంకల్పించింది. మొదట దేవాదుల దిగువన ఆకినపల్లి నుంచి నీటిని మళ్లించాలని ప్రతిపాదించింది. అనేక సర్వేల తర్వాత ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున 143 రోజుల్లో 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌‌‌‌ (కృష్ణా) – సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్‌‌‌‌ ఆనికట్‌‌‌‌ (కావేరి)కు తరలించాలని డీపీఆర్‌‌‌‌ సిద్ధం చేశారు. జూన్‌‌‌‌ నుంచి అక్టోబర్‌‌‌‌ వరకు ఈ నీటిని తరలించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 1,211 కి.మీ.ల పొడవైన కాలువ తవ్వాలని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.85,962 కోట్లు ఖర్చవుతుందని ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ రూపొందించిన డీపీఆర్‌‌‌‌లో వెల్లడించారు. భూసేకరణ, ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ ఆర్‌‌‌‌ ప్యాకేజీ, ప్రత్యామ్నాయ అటవీ పెంపకం లెక్కలోకి తీసుకుంటే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. లక్ష కోట్లు దాటనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో కొత్తగా 80 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవడంతో పాటు 2.87 లక్షల ఎకరాలు స్థిరీకరించాలని, ఇందుకు 65.79 టీఎంసీలు వినియోగించాలని ప్రతిపాదించారు. ఏపీలో 2.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లివ్వడంతోపాటు 1.26 లక్షల ఎకరాల స్థిరీకరించాలని, ఇందుకోసం 79.91 టీఎంసీలు అవసరమని పేర్కొన్నారు. తమిళనాడులో కొత్తగా 1.53 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడం,  78 వేల ఎకరాలు స్థిరీకరించడంతోపాటు చెన్నై తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కలిపి 84.30 టీఎంసీల ఇవ్వాలని ప్రతిపాదించారు.
పోలవరం నుంచే చేపట్టాలంటున్న ఏపీ

పోలవరం నుంచే కావేరి లింక్‌‌‌‌ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతున్నది. తద్వారా తాము చేపట్టిన రాయలసీమ డ్రాట్ మిటిగేషన్‌‌‌‌ ప్రాజెక్టును గట్టెక్కించుకోవాలని చూస్తున్నది. పోలవరం తర్వాత బంగాళాఖాతంలో వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, ఆ నీటిని రివర్‌‌‌‌ లింక్‌‌‌‌కు ఉపయోగించుకోవాలని సూచించింది. పోలవరం కుడి కాలువను విస్తరించి ప్రకాశం బ్యారేజీ మీదుగా తాము నిర్మిస్తున్న బొల్లాపల్లి రిజర్వాయర్‌‌‌‌కు.. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ దిగువన ఉన్న బనకచర్ల క్రాస్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌కు తరలించి.. అక్కడి నుంచి కావేరికి తరలిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌పై స్టడీ చేయాలని పట్టుబట్టింది. తద్వారా గోదావరిలో ఎక్కువ నీటిని కృష్ణా, పెన్నా బేసిన్‌‌‌‌కు మళ్లించుకోవాలని ఏపీ అనుకుంటున్నది. దీనిపై ఎగువ రాష్ట్రాలు ఎలా రియాక్ట్‌‌‌‌ అవుతాయనేది తెలియాల్సి ఉంది. గోదావరి నుంచి కావేరికి మళ్లించే 84 టీఎంసీలకు బదులుగా అంతే నీటిని తమకు ఇవ్వాలని ఇప్పటికే కర్నాటక తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 60 శాతం తాము ఖర్చు చేస్తామని, మిగతా 40 శాతం నిధులు రాష్ట్రాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్‌‌‌‌ ప్రాజెక్టుగా చేపట్టే రివర్‌‌‌‌ లింకింగ్‌‌‌‌కు 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. రివర్‌‌‌‌ లింక్‌‌‌‌ ప్రాజెక్టు చేపట్టే ముందు తమ సమ్మతి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. ఇన్ని సమస్యలను దాటుకొని గోదావరి నీళ్లు కావేరి చేరడం ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనే ప్రశ్న తలెత్తుతున్నది. 

మిగులు జలాల లెక్కలపైనే చిక్కు

గోదావరిలో ఇచ్చంపల్లి వద్ద 75 శాతం డిపెండబులిటీ వద్ద 324 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని, ఇందులోంచి 247 టీఎంసీలు రివర్‌‌‌‌ లింకింగ్‌‌‌‌ ప్రాజెక్టుకు ఉపయోగిస్తామని డీపీఆర్‌‌‌‌లో ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ పేర్కొంది. తెలంగాణ, ఏపీ వినియోగించుకోగా గోదావరిలో 75 శాతం డిపెండబులిటీ వద్ద చుక్క మిగులు నీళ్లు కూడా లేవని రెండు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మిగులు జలాలపై ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ చేపట్టిన హైడ్రాలజీ సర్వే సైంటిఫిక్‌‌‌‌గా లేదని అన్నాయి. మిగులు జలాలపై సమగ్ర స్టడీ చేయాలని పట్టుబట్టాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రం ఇంద్రావతి (గోదావరి ఉపనది)లో ఉపయోగించుకోని 147 టీఎంసీలతో రివర్‌‌‌‌ లింకింగ్‌‌‌‌ ప్రాజెక్టు చేపట్టాలని ప్రతిపాదించింది. చత్తీస్​గఢ్​ను  ఒప్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. దట్టమైన అడవిలో ఉన్న ఇంద్రావతి నీటిని ఉపయోగించుకోవడానికి జోథ్‌‌‌‌పూర్‌‌‌‌ వద్ద 169 టీఎంసీలు మళ్లించుకునేలా మల్టీపర్పస్‌‌‌‌ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, ఇలాంటప్పుడు తమ నీటిని మళ్లించడం సరికాదని ఆ రాష్ట్రం వాదిస్తున్నది. మరోవైపు ఇంద్రావతి నీళ్లల్లో తమకు 40 టీఎంసీల వాటా ఉందని, ఆ నీళ్లను ఉపయోగించుకునేలా ప్రాజెక్టు చేపడుతున్నామని మహారాష్ట్ర అంటున్నది.  మొత్తంగా ఇంద్రావతి నుంచి 209 టీఎంసీలు మళ్లించేలా రెండు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ నదిలోని మిగులు జలాలను కావేరికి ఎలా తరలిస్తారనే ప్రశ్న వస్తున్నది. నదిలో వరద ఉండే రోజుల్లోనే లింక్‌‌‌‌ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తే గోదావరిపై ఆధారపడ్డ మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది.