శ్రీరాంసాగర్కు కొనసాగుతున్న వరద

శ్రీరాంసాగర్కు కొనసాగుతున్న వరద

నిజామాబాద్: శ్రీరాం సాగర్ కు వరద పరవళ్లు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. ఎగువన గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా వరద ప్రవాహం పెరుగుతూ..తగ్గుతూ వస్తోంది. వరద ఉధృతికి అనుగుణంగా గేట్లను ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు అధికారులు. 
ప్రస్తుతం శ్రీరాంసాగర్ కు 50 వేల 790 క్యూసెక్కుల వరద వస్తుండగా...డ్యామ్ ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. 22 గేట్లను ఎత్తి 74 వేల 945 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు..కాగా ప్రస్తుతం 1088.3 అడుగులతో 77.383టీఎంసీల నీటి నిల్వ కొనసాగిస్తున్నారు. 
మొరాయిస్తున్న శ్రీరాం సాగర్ గేట్లు
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు డ్యామ్ గేట్లు మొరాయిస్తున్నాయి. గత 54 ఏళ్లలో కేవలం 10సార్లు మాత్రమే గేట్లు తెరిచారు. పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తే పరిస్థితి లేకపోవడంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. డ్యామ్ కు ఉన్న మొత్తం 42 గేట్లలో 6 గేట్లు మొరాయిస్తున్నాయి. దీంతో 90 టీఎంసీలకు బదులు 75 టీఎంసీల నీటి నిల్వనే కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు 100 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా..ఏటేటా పూడిక పెరిగిపోతుండడంతో ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం కూడా తగ్గుతూ వస్తోంది.