
ఏటూరునాగారం, వెలుగు: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగిందని, పలుచోట్ల తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోయాయని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా సూచించారు. గురువారం ఏటూరునాగారం మండలంలోని దొడ్ల, కొండాయి గ్రామాల మధ్య గతంలో కొట్టుకుపోయిన బ్రిడ్జి వద్ద జంపన్న వాగు పరిస్థితిని అధికారులతో కలిసి పరిశీలించారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండడం, పక్కనే ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయిందన కొండాయి ప్రజలకు నిత్యావసర సరుకులు, వైద్యాధికారులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
కొండాయి, మల్యాల, ఐలాపురం ప్రజలు అత్యవసర పనుల కోసం వెళ్లడానికి ఒక బోటు ఏర్పాటు చేశామన్నారు. ఇబ్బందులొస్తే కలెక్టరేట్కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 18004257109 కు ఫోన్‌చేయాలని చెప్పారు. వరద ఇంకా పెరిగితే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు, తహసీల్దార్ జగదీశ్, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విత్తనాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర టీఎస్హెచ్చరించారు. గురువారం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో పీఏసీఎస్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, బిల్లు బుక్కులు, గోదాంలో నిల్వ చేసి ఉన్న విత్తనాలు, ఎరువులు, మందులను పరిశీలించారు. ఏవో వేణుగోపాల్, పీఏసీఎస్ సీఈవో గౌరి, ఏఈవో రాజు తదితరులున్నారు.
పాఠాలు అర్థమయ్యేలా బోధించాలి
ములుగు(గోవిందరావుపేట), వెలుగు: విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. గురువారం గోవిందరావు పేట మండలం పస్రా హైస్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. టీచర్లు, మధ్యాహ్న భోజన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం క్లాస్ రూంలకు వెళ్లి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. యూనిఫామ్స్, నోట్ బుక్స్ వచ్చాయా, మధ్యాహ్న భోజనం బాగుంటుందా, మెనూ ప్రకారం పెడుతున్నారా అని తెలుసుకున్నారు. 9, 10వ తరగతుల విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పెంచాలని, వందశాతం ఉత్తీర్ణత, టాప్ మార్క్స్ వచ్చేలా కృషి చేయాలని టీచర్లకు చెప్పారు. భోజనంలో తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు వినియోగించాలన్నారు.