భయం గుప్పిట్లో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు

భయం గుప్పిట్లో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు
  •     భద్రాచలం దగ్గర 60 అడుగుల వరద
  •     జలదిగ్బంధంలోనే మన్యం గ్రామాలు
  •     ఎస్సారెస్పీ 26 గేట్లు ఓపెన్ 
  •     అలర్ట్​గా ఉండాలన్న అధికారులు
  •     వారం రోజుల్లో వర్షాలు, వరదల వల్ల 14 జిల్లాల్లో  32 మంది మృతి
  •     ప్రభుత్వానికి రిపోర్ట్​ ఇచ్చిన కలెక్టర్లు

భద్రాచలం / నిజామాబాద్​, వెలుగు: గోదావరి తీర ప్రాంతాల ప్రజలకు మళ్లీ వరద భయం పట్టుకుంది. నెలలో మూడోసారి వరద పెరుగుతుండటంతో వణికిపోతున్నారు. ఎడతెరిపి లేని వానల వల్ల భద్రాచలంలో గరిష్టంగా 71.30 అడుగులకు చేరుకుని తగ్గుముఖం పట్టిన వరద సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 56.10 అడుగుల వద్ద నిలకడగా మారింది. అయితే.. సాయంత్రం నుంచి 60 అడుగుల వరకు వరద వస్తున్నదని ఆఫీసర్లు చెప్తున్నారు. ఎస్సారెస్సీ 26 గేట్లను ఎత్తారు. వారం రోజులుగా భద్రాచలం మన్యం జలదిగ్బంధంలోనే ఉంది. భద్రాచలం రామాలయం పరిసరాల్లోని ఇండ్లన్నీ నాలుగు రోజులుగా నీళ్లలోనే నానుతున్నాయి. సుమారు 50 ఇండ్ల గోడలు నాని కూలిపోయే దశలో ఉన్నాయి. ఇంట్లోని సరుకులు మొత్తం పాడైపోయాయి. బియ్యం, ఫర్నీచర్​, బీరువాలు అన్నీ దెబ్బతిన్నాయి. సుభాష్​నగర్, అయ్యప్ప, ఏఎంసీ, శాంతినగర్​ తదితర కాలనీల్లోని ఇండ్లు దెబ్బతిని 1,253 కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. 4,779 మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు కూనవరం రోడ్డులోని సీఆర్​పీఎఫ్​ 141బెటాలియన్​ క్యాంపులోకి వరద నీరు చేరి రూ. 1 కోటి వరకు నష్టం వాటిల్లింది. కమ్యూనికేషన్​ పరికరాలు, ముఖ్యమైన ఫైళ్లు నీళ్లపాలయ్యాయి. దుమ్ముగూడెం, చర్ల తదితర మండలాల్లోని పలు ఇండ్లు నేలమట్టం అయ్యాయి.  ఇండ్లలోని ఎరువులు, బియ్యం తడిసి ముద్దయ్యాయి. ఇలాంటి టైంలో మళ్లీ వరద ఉధృతి పెరుగుతుండటంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. 

హెలికాప్టర్​ ద్వారా నిత్యావసరాలు

వారం రోజుల నుంచి భద్రాచలం మన్యం ఏడు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్​ అనుదీప్​, ఎస్పీ వినీత్​ ఆర్మీహెలికాప్టర్​ ద్వారా నిత్యావసర సరుకులను పల్లెలకు తరలిస్తున్నారు. మంచినీళ్ల బాటిళ్లు, బ్రెడ్​, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, కొవ్వొత్తులు సరఫరా చేస్తున్నారు. పునరావాస కేంద్రాల నుంచి బయటకు రాకుండా బాధితులంతా అక్కడే ఉండాలంటూ కలెక్టర్​, ఎస్పీ విజ్ఞప్తి చేస్తున్నారు. మళ్లీ వరదలు పెరిగే అవకాశం ఉన్నందున ఎవరూ కేంద్రాల  నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. 

సర్వే షురూ...!

వరద బాధితులను గుర్తించేందుకు అధికారులు సర్వేను ప్రారంభించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు గౌతమ్​, అనుదీప్ 14 అంశాలతో కూడిన ప్రొఫార్మాను సర్వే టీంలకు అందించారు. బాధిత కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయంతో పాటు 20 కిలోల ఉచిత రేషన్​ బియ్యం ఇవ్వాలంటే లెక్కలు పక్కాగా చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలకే పరిహారం జమ చేస్తామని, వారి అకౌంట్​ నంబర్లు తీసుకోవాలన్నారు. ఆర్డీవోలు సర్వేను పర్యవేక్షిస్తారని వారు పేర్కొన్నారు. 4,434 మంది సిబ్బందితో ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. 70 గ్రామ పంచాయతీలతో పాటు భద్రాచలం టౌన్​లో శానిటేషన్​ కోసం 52 మంది ఎంపీవోలను సూపర్​వైజేషన్ కోసం నియమించారు. 219 టీంలు శానిటేషన్ కోసం పనిచేస్తున్నాయి. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో 12,277 ఇండ్లు ముంపునకు గురయ్యాయి. ముంపు నుంచి 11,061 ఇండ్లు బయటపడ్డాయి. ఇక్కడ 2,330 మంది శానిటేషన్​ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంకా 1,216 ఇండ్లు ముంపులోనే ఉన్నాయి. 

ఎస్సారెస్పీ 26 గేట్లు ఓపెన్  

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​లోకి వరద ఉధృతి మళ్లీ పెరుగుతున్నది. ప్రాజెక్ట్​ 26 గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 77  టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీలోకి సోమవారం ఉదయం నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఉదయం 35 వేల క్యూసెక్కుల నుంచి మొదలై సాయంత్రం వరకు 95 వేల 750  క్యూసెక్కులకు చేరింది. 26  గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం వరద ఉధృతి తగ్గడంతో గేట్లను మూసివేయగా.. మళ్లీ ఇన్​ఫ్లో పెరగడంతో సోమవారం ఓపెన్​ చేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఇన్ ఫ్లో పెరుగుతున్నదని, ఆయకట్టు పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముంపు ప్రాంతాల్లోని చెరువుల్లో, గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లరాదని చెప్పారు. 

వర్షాలతో 32 మంది మృతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వర్షాలు, వరదల వల్ల వారం రోజుల్లో 32 మంది మృతి చెందినట్లు ప్రభుత్వానికి జిల్లాల కలెక్టర్లు రిపోర్ట్​ ఇచ్చారు. అత్యధికంగా నిజామాబాద్​ జిల్లాలో ఆరుగురు, కామారెడ్డిలో ఐదుగురు చనిపోయినట్లు తెలిపారు. రంగారెడ్డి, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, మేడ్చల్​, నల్గొండ, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్​, వరంగల్, మహబూబాబాద్​లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.  దాదాపు 862 గ్రామాలు వర్షాలకు ఎఫెక్ట్​ అయినట్లు రిపోర్ట్​లో పేర్కొన్నారు.