త్వరలో గోదావరి ఫేజ్ 2, 3 పనులు

త్వరలో గోదావరి ఫేజ్ 2, 3 పనులు
  • ప్రారంభించాలని అధికారులకు వాటర్ బోర్డు ఎండీ ఆదేశం

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​కు ఎంతో ప్రతిష్టాత్మకమైన గోదావరి-2, 3 దశల పనులకు త్వరలో ముహుర్తం ఖరారు కానుంది. నగరానికి 20 టీఎంసీల అదనపు నీటి తరలించడంతోపాటు మూసీ పునరుజ్జీవం కోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి రూ.7,360 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. మెదక్ జిల్లా ఘనాపూర్ వద్ద మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నీటి శుద్ధి కేంద్రాల పనులను త్వరగా ప్రారంభించాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం ఘనాపూర్​లోని 80 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. 

ఘనాపూర్ నుంచి ఉస్మాన్ సాగర్ వరకు 56 కి.మీ. మేర నిర్మించ తలపెట్టిన రెండు వరుసల పైప్​లైన్​కు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించారు. రోడ్ క్రాసింగ్, టన్నెలింగ్ వంటి సమస్యల ప్రాంతాల్లో పరిశీలించారు. గోదావరి ఫేజ్-1 కింద ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీల నీరు తరలిస్తున్నారు. మిగతా రెండు దశల్లో మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీలలో 17.5 టీఎంసీలు తాగునీటికి, 2.5 టీఎంసీలు మూసీ ప్రక్షాళనకు ఉపయోగించనున్నారు. ఎండీ వెంట ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం మహేశ్ కుమార్ ఉన్నారు.