గోదావరికి వరద ఉధృతి.. పెద్దవాగు ప్రాజెక్టుకు గండి

గోదావరికి వరద ఉధృతి.. పెద్దవాగు ప్రాజెక్టుకు గండి
  • తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత
  • జూరాలకు 20 వేల ఇన్‌ ఫ్లో 
  •  నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
  • భద్రాచలం వద్ద  పెరుగుతున్న గోదావరి 
  •  రాష్ట్రంలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన


భద్రాద్రి కొత్తగూడెం: అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో  అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.  సామర్థ్యానికి మించి నీరు రావడంతో ప్రాజెక్టు కట్టకు నిన్న అర్దరాత్రి భారీ గండింది. రాత్రంతా నీరు దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది.  వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది.  వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి.  పలు గ్రామాల ప్రజలు కొండలు, ఎత్తయిన భవనాల్లో రాత్రంతా తలదాచుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో సహాయక చర్యలకు వీలు లేకుండా పోయింది. కాగా  ఇల్లందు, కోయగూడెం ఉపరితలగనిలో బొగ్గు ఉత్పత్తి  నిలిచిపోయింది. 35వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీత పనులు  నిలిచిపోయాయి.
 
 మంచిర్యాల జిల్లాలో

కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఎదులబంధం అడవిలోని తుతుంగా ప్రాజెక్టు వద్ద గల రోడ్డు పూర్తిగా తగ్గిపోయింది.  ఎదులబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, వెంచపల్లి, సూపాక, నంద్రంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

అలుగు వాగులో  కొట్టుకుపోయిన ట్రాలీ

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరుకుంట-, గుండ్రాత్ పల్లి మధ్యలోని అలుగు వాగులో ఇవాళ బొలెరో ట్రాలీ వెహికిల్ కొట్టుకుని పోయింది. డ్రైవర్ వాహనంపైకి ఎక్కి ఆర్తనాదాలు చేయడంతో గ్రామస్తులు అతనిని రక్షించారు. మహాముత్తారం మండలంలోని పెద్దవాగు ఉదృతంగా ప్రవహించడంతో  కాటారం, మేడారం ప్రధాన రహదారి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.   కాటారం - మేడారం ప్రధాన రహదారిపై కొర్లకుంట వద్ద వంతెనపై నుంచి కారు అదుపుతప్పి వాగులో పడింది.   మహాదేవపూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో కాటారం నుంచి మేడారం వైపు వెళ్తున్నారు.  ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మానేరు,  చలివాగు ఉగ్ర రూపం దాల్చడంతో పలు గ్రామాల మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం  త్రివేణి సంగమం వద్ద  గోదావరి, ప్రాణహిత  ఉధృతంగా ప్రవహిచడంతో 7 మీటర్ల పైగా ఎత్తులో వరద  కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 1,93,550 క్యూసెక్కుల నీరు చేరుతున్నది.  అధికారులు 85 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 

 
భద్రాచలం వద్ద  వరద ఉధృతి 

ఎగువ ప్రాంతాల నుంచి వరద చేరడంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఉదయం 9 గంటల సమయానికి 24.5 అడుగులకు చేరింది. గోదావరికి ఎగువ ప్రాంతంలో ఉన్న పేరూరులో ఉదయం 9 గంటలకు 40.86 అడుగులు నమోదైంది. ఇంద్రావతి, పేరూరు వైపు నుంచి వరద భద్రాచలం వైపు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో ప్రమాద స్థాయికి వరద చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 59,330 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  

జూరాలకు 20 వేల ఇన్‌ ఫ్లో 

గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం పెరుగుతున్నది.  ప్రాజెక్టులోకి 20 వేల  ఇన్‌ ఫ్లో వస్తుండగా,  22,877 క్యూసెక్కుల నీటిని ఔట్‌ ఫ్లో గా వదులుతున్నారు.   పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గాను  ప్రస్తుతం315.850 మీటర్ల   నీటిమట్టం ఉంది. 9.657 టీఎంసీలకు గాను  4.951 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 

కడెం జలాశయానికి భారీగా వరద

నిర్మల్‌ జిల్లా కడెం జలాశయానికి  5,437 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జలాశయానికి పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా  ప్రస్తుత నీటిమట్టం 688.35 అడుగులకు చేరింది.

 తీవ్ర అల్పపీడనం..  జిల్లాలకు భారీ వర్షసూచన

దక్షిణ, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 12 గంటల్లో ఇది వాయుగుండగా మారే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.