ఉమ్మడి ప్రాజెక్టులే లేనప్పుడు.. బోర్డు ఎందుకు?

ఉమ్మడి ప్రాజెక్టులే లేనప్పుడు.. బోర్డు ఎందుకు?
  • కృష్ణా నీళ్ల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలె 
  • జలశక్తి శాఖ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​లో సీఎస్ విజ్ఞప్తి 

హైదరాబాద్‌‌, వెలుగు: గోదావరి నదిపై తెలంగాణ, ఏపీ మధ్య ఉమ్మడి ప్రాజెక్టులేవీ లేవని.. అలాంటప్పుడు గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్‌‌ఎంబీ) అవసరమే లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ అమలుపై మంగళవారం ఢిల్లీ నుంచి జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌‌ కుమార్‌‌ రెండు రాష్ట్రాల సీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. ‘‘కృష్ణా నదిపై కామన్‌‌ ప్రాజెక్టులున్నాయి కాబట్టి అక్కడ బోర్డు అవసరముంది. కానీ గోదావరిపై కామన్‌‌ ప్రాజెక్టులే లేవు. బోర్డును రద్దు చేస్తేనే మంచిది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి” మన రాష్ట్ర సీఎస్‌‌ సోమేశ్‌‌ కుమార్‌‌ కోరారు. రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా నీళ్ల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌‌ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై న్యాయ శాఖ అభిప్రాయం కోరామని, సమాధానం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర కార్యదర్శి చెప్పారు. 
సీడ్‌‌ మనీ ఎందుకు? 
గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ ప్రకారం రెండు రాష్ట్రాలు ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌‌ మనీ వెంటనే విడుదల చేయాలని పంకజ్‌‌ కుమార్‌‌ సూచించారు. అయితే సీడ్ మనీ ఎందుకో? ఆ మొత్తాన్ని దేనికి ఖర్చు చేస్తారో చెప్పాలని సోమేశ్ కుమార్ అడిగారు. ఖర్చుపై క్లారిటీ ఇస్తేనే డబ్బులు ఇస్తామని తేల్చి చెప్పారు. కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టుల నిర్వహణకు ముందుగా ఆపరేషన్‌‌ మాన్యువల్ తయారు చేయాలని డిమాండ్‌‌ చేశారు. అది ఖరారు కాకుండా ప్రాజెక్టులను అప్పగించలేమన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు అప్పగిస్తేనే, తమ ప్రాజెక్టులు స్వాధీనం చేసుకోవాలని ఏపీ సీఎస్‌‌ అన్నారు. ఏపీ సర్కార్ ఎన్‌‌జీటీ ఆదేశాలను ధిక్కరించి సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పనులు చేస్తోందని, వాటిని వెంటనే ఆపేయాలని తెలంగాణ ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌ కోరారు. 
ప్రాజెక్టులకు అనుమతులివ్వండి..  
గోదావరిపై తాము నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతలు, సమ్మక్క సాగర్‌‌ (తుపాకులగూడెం), ముక్తేశ్వర్‌‌ (చిన్న కాళేశ్వరం), చనకా–కొరాట బ్యారేజీ, నిర్మాణం పూర్తయిన చౌట్‌‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతలు, మోడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇప్పటికే ఇచ్చామని.. వాటికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ కోరారు. ఆయా డీపీఆర్‌‌లు త్వరగా పరిశీలించి అనుమతులు ఇస్తామని కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారు. గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న రామప్ప–పాకాల లేక్‌‌ డైవర్షన్‌‌ స్కీం, కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీ, కందకుర్తి లిఫ్ట్‌‌ స్కీం, గూడెం ఎత్తిపోతలు, కంతనపల్లి ప్రాజెక్టులను ఆ జాబితా నుంచి తొలగించాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు. వాటి డీపీఆర్‌‌లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

అప్పులు కట్టేందుకు ఆర్టీసీ డిపోలు తాకట్టు

మరో 10 లక్షల టన్నుల వడ్ల సేకరణకు లైన్‌‌ క్లియర్‌‌