హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మూసీకి గోదావరి నీళ్లు.. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్‌‌‌‌కు తరలింపు

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మూసీకి  గోదావరి నీళ్లు.. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్‌‌‌‌కు తరలింపు
  • రూ.7,360 కోట్లతో గోదావరి డ్రింకింగ్ వాటర్‌‌‌‌ స్కీమ్‌‌ 
  • నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌‌
  • మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు 
  • మల్లన్నసాగర్ నుంచి మొత్తం 20 టీఎంసీలు తరలింపు
  • జంట జలాశయాలకు 2.5 టీఎంసీలు.. సిటీ అవసరాలకు 17.5 టీఎంసీలు
  • ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ ఫేజ్‌‌2లో నిర్మించిన 15 రిజర్వాయర్లు కూడా ప్రారంభించనున్న సీఎం 
  • రూ.298 కోట్లతో చేపట్టే కోకాపేట్ లేఅవుట్ సమగ్రాభివృద్ధి ప్రాజెక్టుకూ శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవంతో పాటు హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చే కీలకమైన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌‌సాగర్‌‌కు గోదావరి నీళ్లను తరలించనున్నది. రూ.7,360 కోట్లతో చేపడ్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌‌లోని ప్రతి ఇంటికి రోజూ నల్లా నీళ్లు సరఫరా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.

హ్యామ్ విధానంలో ప్రాజెక్టు..
హైదరాబాద్‌‌లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు, మూసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చేపడ్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ (ఫేజ్ 2, 3) ప్రాజెక్టును ప్రభుత్వం హైబ్రిడ్‌‌ యాన్యుటీ మోడల్‌‌ (హ్యామ్) విధానంలో చేయనుంది. దీనికి మొత్తం రూ.7,360 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నది. ఇందులో 40% వాటా ప్రభుత్వం భరించనుండగా, మిగిలిన 60% నిధులు కాంట్రాక్ట్ కంపెనీ సమకూర్చుతుంది. ఈ ప్రాజెక్టును కేవలం రెండేండ్లలో పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 20 టీఎంసీలను హైదరాబాద్‌‌కు తరలిస్తారు. ఇందులో 2.5 టీఎంసీలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్​ సాగర్ జలాశయాలను నింపి మూసీ పునరుజ్జీవానికి వినియోగిస్తారు.  మిగిలిన 17.5 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తారు. మార్గమధ్యలో ఉన్న 7 చెరువులను కూడా ఈ జలాలతో నింపుతారు. 

నియో పోలీస్- సెజ్ అభివృద్ధి..
కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.298 కోట్లతో చేపడ్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా నియో పోలీస్- సెజ్‌‌లో తాగు, మురుగునీటి వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. దీన్ని కూడా రెండేండ్లలో పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 13 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులు నగర అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడనున్నాయి.