
న్యూఢిల్లీ : గుజరాత్‌లోని గోద్రాలో 2002లో రైలును దహనం చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష ఎదుర్కొంటున్న 8 మందికి సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు సీజేజస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్ వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇదే కేసులో మరో నలుగురు దోషులకు బెయిల్ ఇచ్చేందుకు బెంచ్ నిరాకరించింది. రైలు దహనం ఘటనలో వారి పాత్రను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్‌కు వివరించారు. గుజరాత్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన మెహతా.. వారి బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. సబర్మతి ఎక్స్ ప్రెస్ ఎస్ 6 కోచ్‌కు దోషులు బోల్టు బిగించి నిప్పు పెట్టారని, దీంతో 59 మంది సజీవ దహనం అయ్యారని ఆయన వివరించారు. దీంతో ఆ నలుగురు దోషులకు బెయిల్‌ను బెంచ్ రద్దు చేసింది.