బ్రేకప్ బాధ నుంచి ఇలా బయట పడండి...

బ్రేకప్ బాధ నుంచి ఇలా బయట పడండి...

"మనకు నచ్చిన వాళ్లు దూరమైతే.. మనమూ వాళ్లతో వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చిన విధంగా మన జీవితం మారుతుంది" అని ఓ సినిమాలో చెప్పినట్టు... జీవితంలో మనం అనుకోని సంఘటనలు జరిగినపుడు, మన అనుకున్న వారు దూరమైతే కలిగే బాధ మాటల్లో చెప్పలేం. ఒక్కోసారి ఆ బాధను మాటల్లో చెప్పేందుకు కూడా పదాలు చాలవు. అయితే మనసుకు బాధ కలిగించే,  అలాంటి ఘటనలు ఎదురైనప్పుడే మనిషి మరింత దృఢంగా తయారవుతారు. మూవ్ ఆన్ ఈ పదం అవతలి వాళ్లకు చెప్పడం చాలా ఈజీ. కానీ అదంత మామూలు విషయం కాదు. కానీ మరీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. బ్రేకప్ వల్ల కలిగే బాధ వ్యక్తిని మానసికంగానే కాదు,  శారీరకంగానూ దెబ్బ తీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలాన్ని , సంఘటనల్ని ఎదుర్కోవాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఈ 5 టిప్స్ పాటించాలని సలహా ఇస్తున్నారు.

సోషల్ మీడియా నుంచి బ్రేక్ 

సోషల్ మీడియా జీవితాలనే మార్చేసింది. అయితే దీని వల్ల ఎంత మంచి జరుగుతుందో దాని వెనుక అంత చెడు దాగుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మనకు నచ్చిన వ్యక్తి వదిలి వెళ్లిపోయినపుడు వారిని మర్చిపోలేక పదే పదే వాళ్లను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ నేపథ్యంలో వారితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను చూస్తూ ఇంకా ఇంకా కుమిలి పోతుంటారు. అలా చేస్తే రోజురోజుకూ బాధ ఎక్కువవుతుందే తప్ప తరగదు. అందుకే ముందు చేయాల్సిన పనేమిటంటే, సోషల్ మీడియాలో వారిని బ్లాక్ చేయడం. వారికి సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయాలి. అలా చేస్తే కొంతైనా వారి జ్ఞాపకాల నుంచి బయటపడగలుగుతాం.

భావోద్వేగాలు దాచుకోవద్దు

కొందరు తమ బాధను లోపలే దాచుకుంటారు. అందరి ముందు నవ్వు నటిస్తూ.. తాము బాగానే ఉన్నామనే భ్రమ కలిగిస్తారు. కొందరు మాట్లాడుతున్నపుడు లోపల ఎంత ఎమోషనల్ అయినా.. దాన్ని బయటికి ప్రదర్శించరు. కానీ నిజం చెప్పాలంటే అలా చేయకూడదు. బాధ కలిగినపుడు ఏడవాలనిపిస్తే ఏడవాలి. అంతే గానీ లోలోపల కుమిలిపోవడం వల్ల నేను సంతోషంగా లేను అన్న భావన, మనం నవ్విన ప్రతిసారీ అనిపిస్తూ ఉంటుంది. అందుకే భావోద్వేగాలను అణుచుకోకుండా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఆశించే ముందు ఆలోచించండి

ప్రేమించిన వ్యక్తి వదిలేసి వెళ్లిపోతే.. చాలా మంది మళ్లీ తాము మునుపటిలా కలిసి ఉంటామని, మళ్లీ వాళ్లు తిరిగొస్తారని ఆశ పడుతుంటారు. కానీ కొన్ని బంధాలలో మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా కాని సందర్భంలో నిజంగా ప్రేమించే వ్యక్తికి అంతులేని బాధ తప్ప ఇంకేం మిగలదు. అందుకే ముందే తాము ఎందుకు విడిపోతున్నాం.. విడిపోదాం అనుకున్నాక మళ్లీ కలిసే ఛాన్స్ ఉందా లేదా అన్న క్లారిటీ తెచ్చుకోవాలి. అందుకోసం ఇద్దరు కలిసి చర్చించుకొని, ఓ కన్క్లూజన్ కి రావాలి. ఇలా చేయడం వల్ల నిజాయితీగా ఉండే వ్యక్తికి తమ రిలేషన్షిప్పై ఓ క్లారిటీ వస్తుంది. సమయం వృథా కాకుండా ఉంటుంది. 

ఆలోచనల్ని పేపర్పై పెట్టండి

కత్తి కన్నా పదునైంది కలం అని అంటారు. అది నిజమే. మనకు కలిగిన బాధను ఎవరితోనైనా షేర్ చేసుకుంటే వాళ్లు మళ్లీ ఎలా స్పందిస్తారో.. లేదంటే వాళ్లు మనల్ని అర్థం చేసుకుంటారో లేదోనన్న సంకోచం చాలా మందిలో ఉంటుంది. అందుకే పెన్నుతో మన ఆలోచనల్ని, నిర్ణయాలను పేపర్ పై పెడితే మనకో క్లారిటీ వస్తుంది. అంతే కాదు మనల్ని ఇంకెవరూ మోసం చేయలేరు అన్న కాన్ఫిడెన్సూ వస్తుంది. అందుకే పెన్ను, పేపర్ ను స్నేహితులుగా భావించి భావోద్వేగాలను షేర్ చేసుకుంటే.. ఈ రోజు రాసిన వాక్యాలను రేపు చదివి చూసుకుంటే.. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నామన్న విషయంలో స్పష్టత వస్తుంది.

పనుల్లో బిజీ అయిపోండి

ఇష్టమైన వ్యక్తి వదిలి వెళ్తే.. వారు చేసిన పనులు పదే పదే జ్ఞాపకాల రూపంలో గుర్తుకొచ్చి బాధను రెట్టింపు చేస్తాయి. అందుకే జీవితంలో కొన్ని కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టండి. సాధారణ దినచర్యను కొన్ని రోజులు పక్కన పెట్టి, కొత్త పనులు చేయండి. మీరు ఇంతకు ముందెప్పుడూ వెళ్లని రెస్టారెంట్ కి వెళ్లండి, లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి, లేదా షాపింగ్ కి వెళ్లడం, లేదా జీవితంలో ఎప్పుడో  చేయాలనుకున్న పనిని చేయడానికి ప్రయత్నిస్తే తప్పక ఫలితం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.జీవితంలో ఏం జరిగినా దాన్ని అధిగమించే ధైర్యం మీలో ఉంది అనుకోండి. ప్రేమించడం, మర్చిపోవడం, విడిపోవడం, మోసం చేయడం, అవసరానికి వాడుకోవడం ఇలా ఏం జరిగినా మనిషి.. తమ అవసరాల మేరకు, ఆయా సందర్భాలలో తీసుకునే నిర్ణయాలేననే నిజాన్ని గుర్తుంచుకోండి. ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో జరగకపోవచ్చు. కానీ ఓసారి అయిన గాయం జీవితాంతం ఉండదు. కొన్ని రోజులకో, నెలలకో, సంవత్సరాలకో మానిపోతుందన్న విషయం గుర్తు పెట్టుకుని ముందుకు అడుగేయండి.