11 నుంచి గోల్కొండ బోనాలు

11 నుంచి గోల్కొండ బోనాలు

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోట జగదాంబికా అమ్మవారి బోనాలు వచ్చే నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా 9 రకాల పూజలు వైభవంగా కొనసాగుతాయి. రాష్ట్రంలో మొదటగా గోల్కొండ బోనాలు మొదలైన తర్వాతే అన్ని దేవాలయాల్లో ప్రారంభమవుతాయి. జులై 11న ఆదివారం మధ్యాహ్నం లంగర్‌‌‌‌ హౌస్‌‌ చౌరస్తాలో అమ్మవారి భారీ తొట్టెలతో పాటు అమ్మవారి రథం, ఊరేగింపు కొనసాగుతుందని దేవాదాయ శాఖ ఈ ఓ మహేందర్ కుమార్ తెలిపారు. రెండో పూజ జులై 15 (గురువారం), మూడో పూజ జులై 18 (ఆదివారం), నాలుగో పూజ జులై 22 (గురువారం), ఐదో పూజ జులై 25 (ఆదివారం), ఆరో పూజ జులై 29 (గురువారం), ఏడో పూజ ఆగస్టు 1 (ఆదివారం), ఎనిమిదో పూజ ఆగస్టు 5 (గురువారం), చివరిగా తొమ్మిదో పూజ ఆగస్టు 8వ తేదీ (ఆదివారం)తో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా, ఈ ఏడాది బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ తెలిపారు.దీనికోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు.