Gold: స్పాట్ మార్కెట్లో ఆల్‌టైం హై కొట్టిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. ఆ 2 కారణాలతోనే ర్యాలీ..

Gold: స్పాట్ మార్కెట్లో ఆల్‌టైం హై కొట్టిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. ఆ 2 కారణాలతోనే ర్యాలీ..

దేశంలో బంగారం ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సరికొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. అక్టోబర్ డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ ధర గత శుక్రవారం ముగింపు ధర10 గ్రాములకు రూ.లక్ష13వేల 788 నుంచి ఇంట్రాడేలో 1.2 శాతం అంటే రూ.1,465 పెరిగి రికార్డు స్థాయిలో రూ.లక్ష 15వేల 253కు చేరుకుంది. ఇదే సమయంలో డిసెంబర్ డెలివరీ కాంట్రాక్టులు కూడా 10 గ్రాములకు శుక్రవారం క్లోజింగ్ కంటే 1.1 శాతం పెరిగి రూ.లక్ష16వేల 203కి పెరిగాయి. 

ఇదే క్రమంలో వెండి కూడా భారీ పెరుగుదలను స్పాట్ మార్కెట్లో చూస్తోంది. శుక్రవారం కేజీ ముగింపు ధర రూ.లక్ష 41వేల 889 నుంచి నేడు ఇంట్రాడేలో 1.6 శాతం పెరిగి డిసెంబర్ ఫ్యూచర్లు కేజీ రేటు రూ.లక్ష 44వేల 179కి చేరుకున్నాయి. దీంతో బంగారం వెండి రేట్లు ఇప్పట్లో తగ్గే ప్రసక్తే లేదని తేలిపోయింది. 

ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు పెరగడం, డాలర్ బలహీనపడటంతో సానుకూల సెంటిమెంట్ ఏర్పడటంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాలు పెరుగుతున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది అన్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అక్టోబర్‌లో వడ్డీ రేటు తగ్గింపుకు 90 శాతం అవకాశం, డిసెంబర్‌లో అదనపు తరలింపుకు 65% అవకాశం ఉందని చెప్పారు. ఇదే సమయంలో పెట్టుబడిదారులు US ప్రభుత్వ షట్‌డౌన్ ప్రమాదాన్ని పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎంప్లాయ్ మెంట్ డేటా ఆలస్యం కావటం కూడా ఆందోళనలు పెంచుతోంది. 

భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, మార్కెట్ అస్థిరతల సమయంలో బంగారం సురక్షితమైన ఆస్తిగా పెరుగుతుంది. ఈ సంవత్సరం ట్రంప్ సుంకాల ఆందోళనలు, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం దాదాపు 50% పెరిగింది. దీనికి తోడు ఇటీవల మందులు, ట్రక్కులు, ఫర్నిచర్ వంటి వస్తువులపై కూడా అక్టోబర్ 1 నుంచి కొత్త టారిఫ్స్ అమలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలను మరింతగా పెంచేస్తోంది. దీనికి అనుగుణంగా ఇన్వెస్టర్లు తమ వ్యూహాలను మార్చుతుండటంతో లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోందని తేలింది.