 
                                    - ధరలు ఎక్కువగా ఉండడమే కారణం
- ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఓకే
న్యూఢిల్లీ: భారీగా ధరలు పెరుగుతుండటంతో బంగారానికి డిమాండ్పడిపోతోంది. ప్రస్తుతం సంవత్సరం జులై–-సెప్టెంబర్ క్వార్టర్లో మనదేశంలో బంగారం డిమాండ్ వాల్యూమ్ పరంగా 16 శాతం తగ్గింది. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు వినియోగదారుల కొనుగోలు ఆసక్తిని తగ్గించాయి. పెట్టుబడి కొనుగోళ్లు మాత్రం పెరిగాయి.
బంగారం సురక్షితమైన ఆస్తి కావడమే ఇందుకు కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూసీజీ) గురువారం వెల్లడించింది. దీని రిపోర్ట్ ప్రకారం..మొత్తం బంగారం డిమాండ్ గత ఏడాది 248.3 టన్నుల నుంచి 209.4 టన్నులకు తగ్గింది. ధరలు పెరగడం వల్ల డిమాండ్ విలువ 23 శాతం పెరిగి రూ. 2,03,240 కోట్లకు చేరింది. భారతదేశంలో అత్యధికంగా వినియోగించే నగల డిమాండ్ 31 శాతం తగ్గి 117.7 టన్నులకు పడిపోయింది.
అయినప్పటికీ, కొనుగోలుదారులు అధిక ధరలకు సర్దుబాటు కావడంతో నగల కొనుగోళ్ల విలువ దాదాపు రూ. 1,14,270 కోట్లుగా ఉంది. పెట్టుబడి డిమాండ్ అసాధారణంగా పెరిగింది. ఇది పరిమాణంపరంగా 20 శాతం పెరిగి 91.6 టన్నులకు చేరుకుంది. విలువ పరంగా 74 శాతం పెరిగి రూ. 88,970 కోట్లకు చేరింది. బంగారం దీర్ఘకాలిక విలువ నిల్వపై భారతీయ వినియోగదారుల్లో నమ్మకాన్ని ఇది తెలియజేస్తుందని డబ్ల్యూసీజీ భారతదేశ ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ అన్నారు.
46 శాతం పెరిగిన ధర
ఈ క్వార్టర్లో భారతదేశంలో బంగారం సగటు ధర (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా) గత ఏడాది రూ. 66,614.1 తో పోలిస్తే 46 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 97,074.9 కి చేరుకుంది. పరిమాణంలో తగ్గుదల ఉన్నప్పటికీ, దీపావళి టైమ్‌లో అక్టోబర్లో బలమైన అమ్మకాలు జరిగాయి. రాబోయే పండుగ, వివాహాల సీజన్లో డిమాండ్ పెరుగుతుందని జైన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పరిమాణంలో 16 శాతం పతనం ఉన్నా, విలువలో 23 శాతం చారిత్రక పెరుగుదలను మనం విస్మరించలేమని పేర్కొన్నారు. పసిడి దిగుమతులు 37 శాతం తగ్గి 194.6 టన్నులకు చేరుకోగా, రీసైక్లింగ్ 7 శాతం తగ్గి 21.8 టన్నులుగా ఉంది. ఈ ఏడాది మొత్తం డిమాండ్ 600-–700 టన్నుల మధ్య ఉంటుందని కౌన్సిల్ అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మాత్రం బంగారం డిమాండ్ రికార్డు స్థాయిలో 1,313 టన్నులకు పెరిగింది. ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర గురువారం సుమారు రూ. 1,20,490 పలికింది.

 
         
                     
                     
                    