11 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గోల్డ్ డిమాండ్

11 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గోల్డ్ డిమాండ్
  •     3,759.6 టన్నులుగా రికార్డు
  •     డబ్ల్యూజీసీ రిపోర్ట్‌‌లో వెల్లడి
  •     కరోనాతో దెబ్బతిన ఇండస్ట్రీ
  •     ఇండియాలో కూడా తగ్గిన డిమాండ్

ముంబై: గ్లోబల్ గోల్డ్ డిమాండ్ 2020లో 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ముఖ్యంగా కరోనా కారణంతో తలెత్తిన ఇబ్బందులతో దేశవ్యాప్తంగా కన్జూమర్ సెంటిమెంట్ దెబ్బతింది. అంతేకాక అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో కూడా డిమాండ్ బలహీనంగానే ఉన్నట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తన రిపోర్ట్‌‌లో పేర్కొంది. మొత్తంగా 2020లో గోల్డ్ డిమాండ్ 3,759.6 టన్నులుగా నమోదైనట్టు డబ్ల్యూజీసీ చెప్పింది. 2019లో మొత్తం కన్జూమర్ డిమాండ్ 4,386.6 టన్నులుగా ఉంది. చివరిసారి 2009లో 3,385.8 టన్నులుగా గోల్డ్ డిమాండ్ ఉన్నట్టు డబ్ల్యూజీసీ 2020 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్ట్‌‌లో వెల్లడించింది. కేవలం నాలుగో క్వార్టర్‌‌‌‌లోనే గ్లోబల్ గోల్డ్ డిమాండ్ ఇయర్ ఆన్ ఇయర్ 28 శాతం తగ్గి 783.4 టన్నులుగా ఉంది. ఇది కిందటేడాది అక్టోబర్–డిసెంబర్ కాలంలో 1,082.9 టన్నులుగా రికార్డయినట్టు రిపోర్ట్‌‌ చెప్పింది.

గ్లోబల్ గోల్డ్ జ్యువెలరీ డిమాండ్ కూడా 2020లో 34 శాతం తగ్గి 1,411.6 టన్నులుగా ఉంది. ఇది కిందటేడాది 2,122.7 టన్నులుగా ఉన్నట్టు డబ్ల్యూజీసీ వెల్లడించింది. కేవలం నాలుగో క్వార్టర్‌‌నే తీసుకుంటే గోల్డ్ జ్యువెలరీ డిమాండ్ 13 శాతం తగ్గి 515.9 టన్నులుగా నమోదైంది. కరోనా వైరస్ మహమ్మారితో రెండో క్వార్టర్‌‌‌‌లో గోల్డ్ డిమాండ్ బాగా పడిపోయింది. పడినప్పటి నుంచి కోలుకునేందుకు జ్యువెలరీ ఇండస్ట్రీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మెల్లమెల్లగా రికవరీ అవుతోంది. 2020 ఏడాదంతా గోల్డ్ మార్కెట్‌‌లో కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్టు డబ్ల్యూజీసీ సీనియర్ మార్కెట్స్ అనలిస్ట్, రీసెర్చ్, లూయిస్ స్ట్రీట్ తెలిపారు. నాలుగో క్వార్టర్లో కూడా ఈ ప్రభావం ఇలానే ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లాక్‌‌డౌన్‌‌లు, ఆర్థిక బలహీనతలు, పెరిగిన గోల్డ్ ధరలు  డిమాండ్‌‌ను పడేశాయని చెప్పారు. మరోవైపు గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌‌(గోల్డ్ ఈటీఎఫ్‌‌లకు)కు మాత్రం గ్రోత్ రికార్డయింది. 2020లో ఈటీఎఫ్‌‌ల డిమాండ్ 120 శాతం పెరిగి 877.1 టన్నులుగా ఉంది. సెంట్రల్ బ్యాంక్‌‌లు కొనుగోలు చేసే గోల్డ్ 668.5 టన్నుల నుంచి 273 టన్నులకు పడిపోయింది. అంటే కిందటేడాదితో పోలిస్తే 59 శాతం మేర సెంట్రల్ బ్యాంక్‌‌ల కొనుగోళ్లు తగ్గాయి.

ఇండియాలో కూడా 35 శాతం డౌన్…

ఇండియాలో గోల్డ్ డిమాండ్ కూడా 2020లో 35 శాతం తగ్గి 446.4 టన్నులుగా రికార్డయింది. కరోనా వల్ల నెలకొన్న ఇబ్బందులతో, ధరలు అధికంగా ఉండటంతో డిమాండ్ తగ్గినట్టు పేర్కొంది. అయితే ఈ ఏడాది ఇండస్ట్రీ రికవరీ అవ్వొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకునే సంస్కరణలు.. ఇండస్ట్రీని బలోపేతం చేయొచ్చని అభిప్రాయపడింది. 2019లో ఇండియాలో గోల్డ్ డిమాండ్ 690.4 టన్నులుగా ఉంది.