భారీగా జోరందుకున్న గోల్డ్ లోన్ బిజినెస్.. త్వరలో రూ.15 లక్షల కోట్లు క్రాస్..

భారీగా జోరందుకున్న గోల్డ్ లోన్ బిజినెస్.. త్వరలో రూ.15 లక్షల కోట్లు క్రాస్..

దేశంలోని ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. క్రెడిట్ రేటింగ్ సంస్థ ICRA తాజా అంచనా ప్రకారం.. మార్చి 2026 నాటికి ఈ బిజినెస్ రూ.15 లక్షల కోట్లకు చేరనుందని అంచనా. ఇది అంతకుముందు అంచనా వేసినదాని కంటే ఏడాది ముందుగానే మైలురాయిని చేరుతుందని సంస్థ వెల్లడించింది. ఇటీవల నెలల్లో బంగారం రేట్లు చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు చేరుకున్న వేళ.. లోన్స్ పెరగటానికి ఆజ్యం పోసింది. 

2027 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బంగారు రుణ మార్కెట్ మరింత పెరిగి రూ.18 లక్షల కోట్లకు చేరవచ్చని రేటింగ్ సంస్థ అంచనా వేస్తోంది. బంగారం ధరలు పెరగటం, అన్ సెక్యూర్డ్ రుణాల వృద్ధి మందగించడం, కొత్త సంస్థల ప్రవేశం వంటి అంశాలు NBFCల బంగారు రుణ ఆస్తులను2026లో 30-35 శాతం పెంచుతాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో-గ్రూప్ హెడ్ AM కార్తిక్ అన్నారు. 

FY20 నుండి FY25 వరకు బంగారం తాకట్టు పరిమాణం కేవలం 1.7 శాతం సగటు వార్షిక వృద్ధిని మాత్రమే చూపించినప్పటికీ.. రుణ పరిమాణం రెండు రెట్లు పెరిగింది. అదే సమయంలో బ్యాంకు శాఖల సంఖ్య 3.3 శాతం సగటు వృద్ధితో మితమైన స్థాయిలో పెరిగింది. FY24-FY25లో ఈ రంగం 26 శాతం వార్షిక వృద్ధి రేటుతో ముందుకు సాగింది. 2025 మార్చి నాటికి బంగారు రుణాల మొత్తం విలువ రూ.11.8 లక్షల కోట్లుగా ఉందని తేలింది. గోల్డ్ లోన్ వ్యాపారంలో బ్యాంకులు అత్యధికంగా 82 శాతం వాటాను కలిగి ఉన్నాయని గుర్తించబడింది. 

NBFCలు తమ ఆపరేటింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడం, తక్కువ క్రెడిట్ నష్టాలను కొనసాగించడం ద్వారా స్థిరమైన లాభాలను సాధిస్తున్నాయి. కానీ కొత్త కంపెనీల ఎంట్రీ.. బ్యాంకుల విస్తరణ వల్ల పోటీ రోజు రోజుకీ తీవ్రమవుతోంది. ఫలితంగా వడ్డీ మార్జిన్‌పై ఒత్తిడి పెరిగే అవకాశముందని కార్తిక్ హెచ్చరించారు. రానున్న కాలంలో బంగారం రేట్లు ఇంకా పెరిగితే రెండేళ్లలో గోల్డ్ లోన్ మార్కెట్ రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.