
- వెండి ధరలు కూడా ఆల్ టైమ్ గరిష్టం దగ్గరనే
- డాలర్ బలహీనపడడం, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు,
- యూఎస్-చైనా టారిఫ్ వార్‌తో గోల్డ్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు
- దీపావళి, దంతేరాస్‌తో ఇండియాలో గోల్డ్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: గ్లోబల్ అంశాలతో పాటు దీపావళి, దంతేరాస్ (ధన త్రయోదశి ) దగ్గర పడుతుండడంతో దేశంలో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనుగోలు చేస్తుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా పుత్తడి ధర ప్రతీ రోజు కొత్త గరిష్టాలను టచ్ చేస్తోంది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాములు గోల్డ్ ఫ్యూచర్స్ ధర గురువారం (అక్టోబర్ 16) రూ.1,185 పెరిగి రికార్డ్ గరిష్టమైన రూ.1,28,395కి చేరింది.
అంతర్జాతీయంగా కూడా బంగారం ఔన్స్ (సుమారు 28 గ్రాముల)కు 4,250 డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది. ఢిల్లీలో స్పాట్ గోల్డ్ ధర రూ.1,31,600 దగ్గర ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చనే అంచనాలు ఎక్కువయ్యాయని, అలాగే యూఎస్, చైనా మధ్య కొనసాగుతున్న టారిఫ్ ఉద్రిక్తతలతో గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్‌కు డిమాండ్ పెరుగుతోందని ఎనలిస్టులు పేర్కొన్నారు.
ఎంసీఎక్స్‌లో జూమ్
దేశీయ ఎంసీఎక్స్‌లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,185 పెరిగి (0.93శాతం) రూ.1,28,395 వద్ద ట్రేడయ్యాయి. ఇది వరుసగా ఐదో రోజు లాభాన్ని నమోదు చేసింది. ఫిబ్రవరి 2026 కాంట్రాక్ట్ కూడా రూ.977 పెరిగి రూ.1,29,380కి చేరింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ ఎక్స్‌పైరీ తర్వాత ఇన్వెస్టర్లు డెలివరీ కావాలంటే ప్రస్తుతం కొన్న రేటుకే గోల్డ్‌ను అప్పుడు డెలివరీ చేస్తారు. ‘‘బంగారం ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ ఈ నెల లేదా డిసెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలు మార్కెట్‌లో బలంగా ఉన్నాయి. డాలర్ విలువ పడడం, యూఎస్ అప్పులు పెరగడం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి”అని యాస్పెక్ట్ బులియన్ సీఈఓ దర్శన్ దేశాయ్ అన్నారు. వెండి కూడా అంతర్జాతీయంగా ఔన్స్‌కి 52.86 డాలర్ల వద్ద ఆల్ టైమ్ హైని తాకిందన్నారు.
అమెరికా, చైనా మధ్య ముదురుతున్న గొడవ..
అమెరికాకు జరిపే రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా ఆంక్షలు పెట్టడాన్ని యూఎస్ ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ ఆంక్షలతో గ్లోబల్ సప్లయ్ చెయిన్ ప్రమాదంలో పడుతుందని యూఎస్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ ప్రకారం, చైనా–రష్యా మధ్య ఆయిల్ ట్రేడ్‌పై అమెరికా, యూరప్ కలిసి ఆంక్షలు విధించొచ్చన్న సూచనలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, బంగారం, వెండి ధరలు ఈ వారం రికార్డు స్థాయిలో పెరిగాయి. ఫెడ్ వడ్డీ తగ్గుదలపై స్పష్టత వచ్చిన వెంటనే, బులియన్ ధరలు మరింతగా పెరిగే అవకాశముందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
వెండి అదే బాటలో
బంగారం ధరల పెరుగుదలతో పాటు వెండి కూడా గురువారం కొత్త గరిష్టాలను తాకింది. ఎంసీఎక్స్‌లో వెండి డిసెంబర్ డెలివరీ ఫ్యూచర్స్ ధర కిలోకి రూ.2,454 పెరిగి రూ.1,64,660కి చేరింది. మార్చి 2026 కాంట్రాక్ట్ రూ.2,699 పెరిగి రూ.1,64,958 లెవెల్‌ను టచ్ చేసింది. ఇది వరుసగా నాలుగో రోజు లాభాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కి 4,254.80 డాలర్లకి చేరాయి. యూఎస్ ఫెడ్ జెరోమ్ పావెల్ తాజా వ్యాఖ్యలు అమెరికాలో ఉద్యోగ మార్కెట్ బలహీనతను సూచిస్తున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ జిగర్ త్రివేది అన్నారు . దీంతో ఈ నెల ఫెడ్ మీటింగ్‌లో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గుదల ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని తెలిపారు. డిసెంబర్‌లో మరోసారి తగ్గించొచ్చన్నారు.