పెళ్లిళ్ల సీజన్ కు ముందుగానే బంగారం ధరలకు రెక్కలు

పెళ్లిళ్ల సీజన్ కు ముందుగానే బంగారం ధరలకు రెక్కలు

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50వేలకు పైన పలుకుతోంది. 3 నెలలుగా పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. డిసెంబర్ లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఉండడంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అక్టోబర్ లో 10గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ.46,300 ఉండగా.. ప్రస్తుతం రూ.47,350 పలుకుతోంది. ఈ లెక్కన చూస్తే నెల రోజుల్లో తులం రేటు వెయ్యిపైనే పెరిగింది. రానున్నది వెడ్డింగ్ సీజన్ కానుండడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇంటర్నేషనల్ మార్కెట్లో అనిశ్చితికి తోడు వెడ్డింగ్ సీజన్ కావడంతో.. ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత డాలర్ బలపడడం కూడా ధరల పెరుగుదలకు ఓ ప్రధాన కారణమని చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు 30 లక్షలకుపైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. ఈ నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పెరిగినా  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.