మార్కెట్ జోష్​.. భారీగా పెరిగిన బంగారం ధరలు

మార్కెట్ జోష్​.. భారీగా పెరిగిన బంగారం ధరలు

న్యూఢిల్లీ: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. యూఎస్, చైనాల వాణిజ్య ఉద్రక్తతలు, మరోవైపు ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం పడుతుండటంతో ట్రేడర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మన దేశంలో సోమవారం వరుసగా రెండో రోజు బంగారం ధర రికార్డుకెక్కింది. సోమవారం నాటికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1.01 శాతం పెరిగి రూ.47,860 గా ట్రెండింగ్ అవుతోంది. వెండి కూడా అదే బాటలో పరుగెడుతోంది. కిలో వెండికి 3.38 శాతం ధర పెరిగి రూ.48,298 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఏడేళ్ల గరిష్ట ధరకు చేరుకున్న గోల్డ్
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు ఏడు సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. సోమవారం 1% పెరిగి ఔన్సుకు 1,759.98 డాలర్లకు చేరుకుంది, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ లోనూ 0.5 శాతం పెరిగి ఔన్స్ 1,765.70 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 2012 అక్టోబర్ నుంచి బంగారం ధర అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్లాటినం 0.7 శాతం, వెండి ధరలు 2 శాతం పెరిగాయి. ఈ ఏడాది ప్రపంచ మార్కెట్లో బంగారం ధర 16 శాతం పెరిగింది.