న్యూఢిల్లీ: వెండి ధరలు చుక్కలనంటుతున్నాయి. వరుసగా మూడో రోజు పెరిగాయి. కిలో ధర శుక్రవారం (డిసెంబర్ 12) రూ.5,100 పెరిగి రూ.1,99,500 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. గురువారం సెషన్‌లో రూ.2,400 ఎగిసి రూ.1,94,400 వద్ద ముగిసిన వెండి, బుధవారం రూ.11,500 పెరిగింది.
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దిలీప్ పర్మార్ ప్రకారం, వెండి కొత్త రికార్డు స్థాయికి చేరగా, బంగారం కూడా గణనీయంగా పెరిగింది. 99.9శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,110 పెరిగి రూ.1,33,600 లెవెల్‌ను టచ్ చేసింది.
రూపాయి బలహీనత, పెట్టుబడి డిమాండ్ బంగారం ధరలను పెంచాయి. అంతర్జాతీయంగా, స్పాట్ గోల్డ్ శుక్రవారం 1.37 శాతం పెరిగి ఔన్స్‌కి 4,338.40 డాలర్లకు చేరింది. విదేశీ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ఔన్స్‌కి 64.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

