రూ.50వేలకు చేరిన బంగారం ధర

రూ.50వేలకు చేరిన బంగారం ధర

బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం 50 వేల రూపాయల మార్కును చేరింది. పండుగ సీజన్ వరకు డల్ గా ఉన్న పసిడి ధరలు, గత వారం రోజుల నుంచి రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో  అనిశ్చితి కారణంగా పసిడికి డిమాండ్ పెరగటంతో  పాటు.. ఆ ఎఫెక్ట్ దేశీయ మార్కెట్లోనూ కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే బంగారం రేట్లు ఏడాది చివరి నాటికి 50 వేలకు పైగా చేరొచ్చని అంచనావేస్తున్నారు ఫైనాన్షయల్ ఎక్స్ పర్ట్స్.

పండుగల సీజన్ నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గతవారం నుంచి ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. గత బుధవారం ఒక్కరోజే 9 నెలల గరిష్టానికి చేరింది. ఈ ఏడాది ఆగస్ట్ తర్వాత పసిడి 48 వేల నుంచి పెరగుతూ, తగ్గుతూ 50 వేల మార్క్ ను చేరింది. కరోనా ప్యాండమిక్ టైమ్ లో ఉన్న రేట్లు.. పోస్ట్ కోవిడ్ తర్వాత కొద్దిగా తగ్గాయి. ప్రస్తుతం ఆల్ టైమ్ హైకి బంగారం ధరలు వస్తున్నాయి. 22 క్యారెట్ల బంగారం 46 వేల 110 వద్ద, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 50 వేల ధర పలుకుతోంది. సాధారణంగా డిసెంబర్ – జనవరిలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. కానీ ఈ సంవత్సరం నవంబర్ నుంచే పెరుగుదల మొదలైందని, ఈ వారం రోజుల్లో బంగారం ధరలు దాదాపు 15వందల వరకు, వెండి 3వేల వరకు పెరిగిందంటున్నారు గోల్డ్ వ్యాపారులు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, పండుగల సీజన్ కారణంగా డిమాండ్ బాగుందని, ఈ డిమాండ్ పెరగటం వల్లే గోల్డ్ రేట్లు పెరుగుతూ వస్తున్నాయంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడూ బంగారానికి డిమాండ్ పెంచేస్తాయి. యూఎస్ లో ఆర్థిక మాంద్యం పెరగటంతో పెట్టుబడిదారులు ముందుజాగ్రత్తగా పసిడిని కొంటున్నారు. ఆ ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రధానంగా స్టాక్ మార్కెట్లో విలువైన మెటల్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో.. బులియన్ వర్గాలు కూడా ప్యూచర్ కాంట్రాక్టుల్లో భాగంగా.. గోల్డ్ లో పెట్టుబడులకు ఆసక్తిని చూపుతారంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్. న్యూయార్క్ కమోడిటీస్ మార్కెట్లో ఒక దశలో బంగారం 1807 నుండి 1892 డాలర్ పర్ ఔన్స్ పైచిలుకు వద్ద ట్రేడ్ కాగా, వెండి 25 డాలర్ల వద్ద నమోదైంది. ప్యూచర్ లో  బంగారం 1900 పర్ ఔన్స్ కు వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. ప్యూర్ గోల్డ్ రీసెంట్ గా 47వేలకు తక్కువగా ఉందని... ప్రస్తుతం 49వేల 8వందల నుంచి 50 వేల మధ్యలో ధరల ఫ్లక్చువేషన్స్ ఉన్నాయంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రూపాయి మారకం రేటుకు అనుగుణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగటం, తగ్గటం జరుగుతుంటాయి. ప్రధానంగా ఇన్ ఫ్లేషన్స్ పెరగడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, పండుగల కోసం గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరడం వంటి కారణాలతో ధరలు పెరుగుతూ వస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ అధికమవటంతో.. అంతర్జాతీయ కమోడిటీస్ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎగబాకాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైతే గోల్డ్ కొనే వారు అవసరం ఉంటేనే కొనాలని సలహా ఇస్తున్నారు ఆర్థికవేత్తలు. 24 క్యారెట్ తులం బంగారం ప్రస్తుతం 50వేలకు చేరింది. పెరుగుతున్న క్రూడాయిల్, నిత్యావసర ధరలతో పాటు బంగారం ధరలు అదే బాటలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మళ్లీ కరోనా ప్యాండమిక్ ఎఫెక్ట్ ఉంటే మరింతగా గోల్డ్ రేట్స్ పెరగొచ్చంటున్నారు ఎక్స్ పర్ట్స్.