
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్, యూఎస్ హెచ్-1బీ వీసా ఫీజు పెంపు కారణంగా రూపాయి విలువ పడిపోవడం ఇందుకు కారణం. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర మంగళవారం రూ. 2,700 పెరిగి 10 గ్రాములకు రూ. 1,18,900 కొత్త గరిష్ట స్థాయికి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 2,650 పెరిగి 10 గ్రాములకు రూ. 1,18,300 రికార్డు గరిష్టాన్ని తాకింది.
సోమవారం ఈ ధర రూ. 1,15,650 వద్ద ముగిసింది. వెండి ధరలు కూడా కేజీకి రూ.3,220 పెరిగి రూ. 1,39,600 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతకు ముందు ట్రేడింగ్ సెషన్లో వెండి ధర కేజీకి రూ.1,36,380 వద్ద ముగిసింది. మంగళవారం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 47 పైసలు తగ్గి రూ.88.75 వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.