గోల్డ్ రేట్లు పెరుగుతయి!

గోల్డ్ రేట్లు పెరుగుతయి!
  • గోల్డ్ రేట్లు పెరుగుతయి!
  • వచ్చే 12 నెలల్లో రూ. 54 వేలకు చేరుకుంటుందని అంచనా
  • స్టాక్‌ మార్కెట్‌‌కు నెగెటివ్​గా మారిన గ్లోబల్ అంశాలు
  • గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు    
  • ఇప్పుడు కొనుక్కోవచ్చంటున్న ఎనలిస్టులు

బిజినెస్ డెస్క్, వెలుగు: ఈ ఏడాది షేర్ మార్కెట్ ఇచ్చినంత రిటర్న్స్‌‌ను గోల్డ్ ఇవ్వలేదు. కానీ, ఎనలిస్టులు మాత్రం అనిశ్చిత పరిస్థితుల్లో గోల్డ్‌‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు. వచ్చే 12 నెలల్లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 52 వేల మార్క్ ను క్రాస్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది దీపావళి లోపు 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 53 వేల వరకు వెళ్తుందని బ్రోకరేజ్ కంపెనీ మోతిలాల్ ఓస్వాల్  అంచనా వేసింది. 'గోల్డ్ పై బులిష్ గా ఉన్నాం. ఇంకో ఏడాది కాలం వరకు ఇదే వైఖరిని కొనసాగిస్తాం' అని ఈ బ్రోకరేజ్ కంపెనీ పేర్కొంది.   గోల్డ్ ఇప్పటివరకు కన్సాలిడేట్ అయ్యిందని, ఇప్పుడు పెరుగుతుందని అంచనావేసింది. ప్రస్తుతం గోల్డ్ కొనడానికి మంచి అవకాశం ఉందని పేర్కొంది. 'ఔన్స్ గోల్డ్ ధర 2000 డాలర్లకు చేరుకుంటుందని నమ్ముతున్నాం. కొత్త రికార్డ్ హైని టచ్ చేసినా చేయొచ్చు' అని మోతిలాల్ ఓస్వాల్ తెలిపింది. కిందటేడాది దీపావళితో పోలిస్తే ఈ సారి దీపావళి టైమ్‌‌లో గోల్డ్ రేట్లు పెరగడానికి పాజిటివ్ అంశాలు కనిపిస్తున్నాయి. ' ఈ దీపావళి టైమ్‌‌లో షాప్‌‌లు, స్టోర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాయి. గోల్డ్‌‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 740 టన్నుల గోల్డ్‌‌ను దిగుమతి చేసుకున్నాం. ఈక్విటీ వంటి రిస్కు ఎక్కువగా ఉన్న అసెట్స్ ఈ ఏడాది భారీగా పెరిగాయి. ఈ అసెట్స్ ట్రెండ్‌‌లో ఏమాత్రం మారినా, గోల్డ్ వంటి అసెట్స్ వైపు ఇన్వెస్టర్లు పరుగెడతారు' అని మోతిలాల్ అంచనావేసింది. గత ఎనిమిదేళ్లను గమనిస్తే గోల్డ్ ధరలు ఏడాదికి డబుల్ డిజిట్ గ్రోత్​ను నమోదు చేశాయి. 2019లో గోల్డ్ రేట్లు52%, 2020లో 25% పెరిగాయి. కానీ, ఈ ఏడాది గోల్డ్ రేట్లకు పెద్దగా కలిసి రాలేదు. ఈ ఏడాదే  10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 51, 875 కు చేరుకుంది. అదే విధంగా రూ. 43,320 కి కూడా పడింది.

యుఎస్ ఎకానమీ డౌన్.. గోల్డ్ కు పాజిటివ్
' వచ్చే దీపావళి నాటికి 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 54 వేలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. అప్పటి వరకు గోల్డ్ కు రూ. 42,300-– 41,100 మధ్య సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ కూడా కోల్పోతే గోల్డ్ రేటుకు రూ. 35,700 వద్ద , రూ 29,500 వద్ద స్ట్రాంగ్ సపోర్ట్ దొరుకుతుంది' అని బ్రోకరేజ్ కంపెనీ ఏంజెల్ వన్ పేర్కొంది.  యూఏస్ డాలర్, బాండ్ మార్కెట్ లో వొలటాలిటీ  కొనసాగడంతో గత కొన్ని నెలల నుంచి గోల్డ్ రేట్లు స్తబ్దుగా కదిలాయి .ఎకనామిక్ డేటా అంచనాల కంటే మెరుగ్గా ఉండడంతో పాటు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మార్చక పోవడంతో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో గోల్డ్ పై నెగెటివ్  ప్రభావం పడింది. కానీ ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో పరిస్థితిలు మారాయి. యూఎస్ ఎకనామిక్ డేటా వీక్ గా ఉంది. యూఎస్ ఫెడ్ కూడా కీలక రేట్లను పెంచాలని చూస్తోంది. ఈ అంశాలు గోల్డ్ పెరగడానికి కారణమవుతాయి.

గోల్డ్ డిమాండ్ పెరిగింది..
వరల్డ్ గోల్డ్  కౌన్సిల్ డేటా ప్రకారం, దేశంలో గోల్డ్‌‌ రిటైల్ సెగ్మెంట్‌‌లో డిమాండ్ పెరుగుతోంది. కరోనా రిస్ట్రిక్షన్లు తగ్గడంతో గోల్డ్ కొనుగోళ్ళు పెరుగుతున్నాయి. ' ఫెస్టివ్ సీజన్, వెడ్డింగ్ సీజన్ ఉండడంతో గోల్డ్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఈ సీజన్‌‌లోనే గోల్డ్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నాం. డిజిటల్ గోల్డ్‌‌కూ డిమాండ్ పెరుగుతోంది. ఇన్నోవేటివ్ టెక్నాలజీని వాడుతూ జ్యువెలరీ కంపెనీలు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి' అని వరల్డ్  గోల్డ్  కౌన్సిల్ పేర్కొంది. ఈ ఏడాది జులై–-సెప్టెంబర్ క్యార్టర్‌‌‌‌లో  దేశంలో గోల్డ్ డిమాండ్ 139.1 టన్నులకు చేరుకుంది. కిందటేడాది క్యూ2తో పోలిస్తే ఈ సారి గోల్డ్ డిమాండ్ 47% పెరిగింది. గోల్డ్ జ్యువెలరీ డిమాండ్ 58% పెరిగి 96.2 టన్నులకు పెరిగింది. 

ఇన్‌‌ఫ్లేషన్‌‌ పైకి..గోల్డ్‌‌ రేట్లు పైకి
వీటికి తోడు ద్రవ్యోల్బణం  పెరుగుతోంది. చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు పెట్టుకున్న టార్గెట్‌‌ల కంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదవుతోంది. ఈ పరిస్థితులు  సేఫ్ హెవెన్ అయిన గోల్డ్ వైపు  ఇన్వెస్టర్లను లాగుతాయి. 'వీటికి తోడు చైనా ఎవర్ గ్రాండే సంక్షోభం, కరోనా డెల్టా వేరియంట్ విస్తరిస్తుండడం, అప్పులు పెరుగుతుండడం వంటి అంశాలు గోల్డ్‌‌ను బులిష్‌‌గా మారుస్తున్నాయి. రానున్న ఫెడ్ మీటింగ్‌‌లో బాండ్ కొనుగోళ్లును భారీగా తగ్గించే అవకాశాలున్నాయి. ఎదైనా కారణంతో మార్కెట్లు పడితే అది గోల్డ్‌‌కు పాజిటివ్ గా మారుతుంది' అని మోతిలాల్ ఓస్వాల్ వివరించింది.