శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.2కోట్ల విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.2కోట్ల విలువైన బంగారం పట్టివేత
  •     రూ.16 లక్షల విదేశీ కరెన్సీ కూడా స్వాధీనం
  •     ఆరుగురు నిందితులు అరెస్ట్‌‌

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.2 కోట్ల విలువైన బంగారంతో పాటు రూ.16 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీని కస్టమ్స్‌‌ అధికారులు పట్టుకున్నారు. గురువారం దుబాయ్‌‌, బెహరాన్‌‌, షార్జా నుంచి వేర్వేరు విమానాల్లో వచ్చిన ఆరుగురు ప్యాసింజర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి రూ.42.52 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, మరో ప్యాసింజర్‌‌‌‌ వద్ద రూ.12.56 లక్షల విలువైన 214 గ్రాములు, ఇంకొకరి నుంచి రూ.49.17 లక్షల విలువైన 840 గ్రాములు, మరొకరి నుంచి రూ.43.12 లక్షల విలువైన 736 గ్రాములు, షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ.71.41 లక్షల విలువైన 1,220 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బెహరాన్‌‌ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి 200 గ్రాముల బంగారం పేస్ట్‌‌ను గుర్తించారు. మొత్తం ఆరుగురు నిందితుల నుంచి 3.734 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.2.12 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అలాగే, వీరి నుంచి రూ.16 లక్షల విలువైన విదేశీ కరెన్సీ కూడా పట్టుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.