తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణరధోత్సవం వేడుక అట్టహాసంగా జరిగింది. తిరుమాడవీధులలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగుతూ భక్త జనకోటికి దర్శనం ఇచ్చారు మలయప్పస్వామి. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
'స్వర్ణ' మంటే 'బాగా ప్రకాశించేది' అని వ్యుత్పత్తి. స్వర్ణం లభించేది భూమి నుండే. కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారు మధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం - స్వామివారి మహోన్నతినీ, సార్వభౌమత్వాన్నీ, శ్రీసతిత్వాన్నీ, భూదేవీనాథత్వాన్నీ సూచిస్తూంది.
ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
