ఒకే వేదికపై మెస్సీ, సచిన్‌‌‌‌‌‌‌‌.. వాంఖడేలో గోల్డెన్ సీన్‌‌‌‌‌‌‌‌.. హోరెత్తిన స్టేడియం

ఒకే వేదికపై మెస్సీ, సచిన్‌‌‌‌‌‌‌‌.. వాంఖడేలో గోల్డెన్ సీన్‌‌‌‌‌‌‌‌.. హోరెత్తిన స్టేడియం

ముంబై: సచిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. లియోనల్ మెస్సీ.  ఒకరు క్రికెట్ దేవుడు. మరొకరు ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ రారాజు. ఈ ఇద్దరూ కలిసి  ఒకే వేదిక మీద కనిపిస్తే  అభిమానులకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. ఆదివారం ముంబై వాంఖడే స్టేడియంలో అదే జరిగింది. తమ ఆటలో అత్యున్నత శిఖరాలను చేరుకున్న ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక్క చోటుకు చేరి అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించారు. తన ‘గోట్ టూర్ ఇండియా’లో భాగంగా తొలి రోజు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఉప్పల్ స్టేడియంలో భాగ్యనగర ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు కిక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన మెస్సీ రెండో రోజు ముంబైని మెస్మరైజ్ చేశాడు. ఇండియన్ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైన వాంఖడే స్టేడియంలో సచిన్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రితో కలిసి అతను వేదిక పంచుకోవడం ఈ  టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే హైలైట్‌‌‌‌‌‌‌‌గా మార్చింది. 

సచిన్ అడ్డాలో లియోనల్‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌వాంఖడే స్టేడియం అంటేనే సచిన్.. సచిన్.. నినాదాలకు పెట్టింది పేరు. టెండూల్కర్ మైదానంలో ఉన్నా, లేకపోయినా ఆ పేరు వినిపిస్తూనే ఉంటుంది. కానీ, ఆదివారం ఆ పరిస్థితి మారింది. సాయంత్రం 5:45 గంటల సమయంలో టెండూల్కర్.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌‌‌‌‌‌‌తో కలిసి అభిమానులతో పూర్తిగా నిండిపోయిన మైదానంలోకి వచ్చాడు.  కొద్దిసేపటికే వైట్ టీ షర్ట్‌‌‌‌‌‌‌‌, బ్లూ ట్రాక్‌ వేసుకున్న  మెస్సీ తన ఇంటర్ మయామి టీమ్‌‌‌‌‌‌‌‌ మేట్స్ లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌‌‌‌‌‌‌తో కలిసి రెడ్‌‌‌‌‌‌‌‌ కార్పెట్‌‌‌‌‌‌‌‌పై కూల్‌‌‌‌‌‌‌‌గా నడుస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ‘మెస్సీ.. మెస్సీ’ నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఇక, మెస్సీతో వేదికను పంచుకోవాలని టెండూల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పిలిచినప్పుడు  మాత్రం  మైదానం సచిన్.. సచిన్ నినాదాలతోహోరెత్తింది.

గంట పాటు మెస్సీ షో

ఉప్పల్ మాదిరిగా వాంఖడే స్టేడియంలో దాదాపు గంట సమయం గడిపిన మెస్సీ ఆద్యంతం ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను  ఉత్సాహపరిచాడు. సువారెజ్, డిపాల్‌‌‌‌‌‌‌‌తో కలిసి  యంగ్ ప్లేయర్లతో రొండో  (పాస్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చిపుచ్చుకోవడం) గేమ్ ఆడాడు.  మెస్సీ ఒక పెనాల్టీ గోల్ కొట్టి స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. ఆపై, చిన్నారులకు ఆటలో చిట్కాలు నేర్పించి వారికి సర్టిఫికెట్స్‌‌‌‌ అందించిన మెస్సీ, సువారెజ్‌‌‌‌‌‌‌‌, డిపాల్ ఆ తర్వాత గ్యాలరీలోని అభిమానుల వైపు బంతులను కిక్ చేసి వారిని ఆనందంలో ముంచెత్తారు.  తొలుత - మెస్సీ గౌరవార్థం బాలీవుడ్,  క్రీడా ప్రముఖుల మధ్య జరిగిన 7x 7 ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.  ఇండియన్ స్టార్స్‌‌‌‌తో జరిగిన ఈ గేమ్‌‌‌‌‌‌‌‌లో సునీల్ ఛెత్రి నేతృత్వంలోని మిత్రా స్టార్స్ గెలిచింది. ఛెత్రి, మాజీ విమెన్ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ స్టార్ బాలా దేవి, బాలీవుడ్ యాక్టర్లు  టైగర్ ష్రాఫ్, ఇబ్రహీం అలీ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. చివర్లో మహారాష్ట్రలో ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ అభివృద్ధి కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్ మహా-–దేవ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర  సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మెస్సీ ప్రారంభించాడు.   అనంతరం ఓ ప్రైవేట్ చారిటీ ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌ షోలో 
పాల్గొనేందుకు వెళ్లాడు.

నేడు పీఎం మోదీతో భేటీ

ఇండియా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చివరి రోజైన  సోమవారం మెస్సీ ఢిల్లీలో పర్యటిస్తాడు.  ఉదయం ఢిల్లీ చేరుకొని ఓ హోటల్‌‌‌‌‌‌‌‌లో మీట్ అండ్ గ్రీట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే లియోనల్‌‌‌‌  అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన అధికారిక నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు భేటీ కానున్నాడు. ఓ ఎన్సీపీ ఎంపీ నివాసంలో  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్‌‌‌‌, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వంటి ఉన్నతాధికారులను కూడా కలుస్తాడని సమాచారం. అనంతరం  సాయంత్రం ఫిరోజ్‌‌‌‌‌‌‌‌షా కోట్లా స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌, ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ క్లినిక్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటాడు. ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు విరాట్ కోహ్లీ, మరో క్రికెటర్ అటెండై.. 
మెస్సీని సన్మానిస్తారని తెలుస్తోంది. 

ఇదో గోల్డెన్‌ మూమెంట్‌: సచిన్‌‌‌‌‌‌‌‌

మెస్సీ రాక ముంబైకే కాకుండా యావత్ దేశానికే  గోల్డెన్ మూమెంట్‌ సచిన్ అభివర్ణించాడు. ‘ముంబైని మనం సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటాము. ఎందరో కలలు ఇక్కడ సాకారమయ్యాయి. 2011లో మీ అందరి సపోర్ట్‌‌‌‌తో మేం వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ను ముద్దాడిన క్షణాలు నాకింకా గుర్తున్నాయి. ఈ రోజు ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ లెజెండ్స్ మెస్సీ, సువారెజ్, డి పాల్ ఇక్కడ ఉండటం నిజంగా ముంబైకర్లకు, ఇండియన్స్‌‌‌‌‌‌‌‌కు గర్వకారణం. మెస్సీ  సాధించనిది ఏదీ లేదు. తన అంకితభావం, పట్టుదల, నిబద్ధత  మనందరికీ ఆదర్శం. అన్నింటికంటే ముఖ్యంగా మెస్సీ వినయం తను ఎలాంటి వ్యక్తో  చెబుతుంది’ అని సచిన్ కొనియాడాడు. ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌లోనూ ఇండియా ఎప్పటికైనా అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అనంతరం తన సంతకం చేసిన 2011 వరల్డ్ కప్ విన్నింగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా జెర్సీని మెస్సీకి సచిన్‌‌‌‌‌‌‌‌ బహూకరించాడు. ప్రతిగా లియోనల్‌‌‌‌‌‌‌‌ ఒక ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ను కానుకగా ఇచ్చాడు. ఇక,   సునీల్ ఛెత్రితో మాట్లాడిన  మెస్సీ తన సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని అతనికి అందించి గౌరవించాడు.