- కొనసాగుతున్న వాగ్గేయకారోత్సవాలు
భద్రాచలం, వెలుగు : భద్రాచల సీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో అర్చన జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చాక గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవను నిర్వహించారు. బాలబోగం నివేదించారు. రామపాదుకలను భద్రుని మండపానికి తీసుకెళ్లి పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. అనంతరం సీతారాముల మూలవరులను సుందరంగా అలంకరించి బంగారు తులసీదళాలతో అర్చనను వేదోక్తంగా చేశారు.
ఈ సందర్భంగా విశేషంగాహారతులను సమర్పించారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేశారు. కంకణాలు ధరించిన భక్తులు ఈ క్రతువును వైభవంగా నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య జరిగిన ఈ కల్యాణ వేడుక అనంతరం అర్చకులు మంత్రపుష్పం సమర్పించారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం స్వామికి దర్బారు సేవ ఘనంగా జరిగింది. సీతారామయ్యకు దివిటీ సలాం సమర్పించారు.
భద్రగిరి.. సంగీతఝరి
భక్తరామదాసు 393వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వాగ్గేయకారోత్సవాలు శనివారం రెండో రోజు కూడా కొనసాగాయి. కళాకారులు వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించారు. పుచ్చా రాజ్యలక్ష్మి, శాంతిసుధ, సముద్రాల రోజారమణి, మద్దాలి గౌతమి, స్రవంతి, గాయత్రి, వైష్ణవి, రుద్రావఝుల లక్ష్మీకృష్ణ ప్రియ, సోమయాజుల విష్ణు ప్రియ, విద్యాసాగర్‌రావు, సింధు రాగేశ్వరీలు భక్తరామదాసు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించడంతో భద్రగిరి సంగీత సాగరంలో ఓలలాడింది. తమ గాత్రంతో భక్తులను తన్మయులను చేసిన సంగీత కళాకారులకు పారితోషికం, దేవస్థానం తరుపున ప్రసాదంను ఈవో దామోదర్‌రావు అందజేసి సత్కరించారు.
