టీనేజ్ యువతులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా న్యూట్రీషన్ ఫుడ్

 టీనేజ్ యువతులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా న్యూట్రీషన్ ఫుడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐరన్ లోపం, రక్తహీనత సమస్యలు లేకుండా ఉండేందుకు మరో వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 14 ఏండ్ల నుంచి 18 ఏండ్ల మధ్య ఉన్న యువతులు ఐరన్, రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు మిల్లెట్ పట్టీలు, పల్లి పట్టీలు ఇవ్వాలని నిర్ణయించింది. నెలకు 15 ప్యాకెట్ల చొప్పున రెండు రకాలను ప్రతి టీనేజ్ యువతికి అంగన్ వాడీల ద్వారా పంపిణీ చేయనున్నారు. వీటికి ‘ఇందిరమ్మ అమృతం’అనే పేరును పరిశీలిస్తున్నారు.

త్వరలో ఈ పేరుపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. తొలి దశలో ఫైలట్ ప్రాజెక్టుగా కొత్తగూడెం, అసిఫాబాద్, ములుగు జిల్లాలను ఎంపిక చేశారు. ముందుగా ఈ జిల్లాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న టీనేజ్ యువతులను అంగన్ వాడీ టీచర్, ఆయాలు గుర్తించి కేంద్రాలకు పిలిచి వీటిని పంపిణీ చేయనున్నారు. అలాగే, సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

ఇప్పటికే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌‌‌‌ను ఎంపిక చేయగా, జూన్ నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో మిల్లెట్, పల్లి పట్టీలు పంపిణీ చేయనున్నారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య లక్ష్మి పథకం కింద అంగన్‌‌ వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు బియ్యం, పప్పు, 200 మిల్లీ లీటర్ల పాలు, నెలకు 30 గుడ్లు అందిస్తోంది.