హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ లో పనిచేస్తున్న ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ కు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఇచ్చే ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ ను నెలకు రూ.1,500 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, ఎస్ఆర్డీఎస్ సీఈవో డి.దివ్య ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈనెల 1 నుంచే అమల్లోకి వస్తాయని, సంబంధిత జిల్లాల డీఆర్డీవోలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాజా పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో పనిచేస్తున్న 3,420 మంది సిబ్బందికి ఆర్థికంగా ఊరట లభించనుంది. దీని ప్రకారం 1,835 మంది టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏ), 13 మంది అడిషనల్ డీఆర్పీలు, ప్లాంటేషన్ సూపర్వైజర్లకు ఇప్పటివరకు అందుతున్న అలవెన్స్ రూ.2,000 నుంచి రూ.3,500కు పెరిగింది. అదే విధంగా 367 మంది ఏపీవో, 294 మంది ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు (జేఈ సివిల్), ప్లాంటేషన్ మేనేజర్లకు గతంలో ఉన్న రూ.2,500 భత్యం ఇకపై రూ.4,000కు చేరనుంది. ఇప్పటివరకు నెలకు రూ.500 మాత్రమే అలవెన్స్ పొందుతున్న 850 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్స్ అసిస్టెంట్లకు ఇకనుంచి నెలకు రూ.2 వేలు అందనుంది.
