ముంబై: ఆర్బీఐ రెపో రేటుకు మరోసారి కోత పెట్టింది. ఈసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 5.25 శాతానికి దిగొచ్చింది. గోల్డీలాక్స్ ఆర్థిక వ్యవస్థకు (నిలకడగా వృద్ధి చెందేది) మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. మనదేశానికి యూఎస్ టారిఫ్‌ల సెగ తగులుతున్న పరిస్థితులలో ఈ నిర్ణయం ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వనుంది.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) తటస్థ వైఖరిని కొనసాగించింది. ఇది భవిష్యత్తులో మరింత రేట్ల తగ్గింపునకు అవకాశం ఇస్తుంది. రెపో రేటు తగ్గింపుతో హోమ్, ఆటో, పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. వినియోగదారులు, వ్యాపారులు మరింత అప్పు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
అయితే బ్యాంకుల్లో, ఎన్బీఎఫ్సీల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్డీల వంటి విధానాల్లో డబ్బును పొదుపు చేసిన వారికి మాత్రం వడ్డీ ఆదాయం తగ్గుతుంది. భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం టారిఫ్ విధించడం వల్ల ఎగుమతులు తగ్గాయి. వాణిజ్య లోటు పెరిగింది. రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి (డాలర్‌తో పోలిస్తే 90కి) పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ఆర్బీఐ రేటును తగ్గించింది.
లిక్విడిటీ పెంపునకు రూ.లక్ష కోట్ల ఓఎంఓ
బ్యాంకింగ్ వ్యవస్థకు తగినంత లిక్విడిటీని అందించడానికి కట్టుబడి ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల కోసం రూ. లక్ష కోట్ల వరకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్(ఓఎంఓ) నిర్వహించనుంది. ఈ నెల 11, 18 తేదీల్లో రూ.50 వేల కోట్ల చొప్పున రెండు విడతలుగా జరుగుతుంది. 16వ తేదీన ఐదు బిలియన్ డాలర్ల బై-–సెల్ స్వాప్‌ను నిర్వహిస్తుంది.
బ్యాంకులు లిక్విడిటీ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, ఈ నిర్ణయాలు మార్కెట్‌కు ద్రవ్య లభ్యతను పెంచుతాయి. ఈ సందర్భంగా మల్హోత్రా మాట్లాడుతూ, 2025–-26 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో (ఏప్రిల్–-సెప్టెంబర్) ద్రవ్యోల్బణం 2.2 శాతం, వృద్ధి 8.0 శాతంగా ఉండటం అరుదైన "గోల్డీలాక్స్ పీరియడ్"ను
సూచిస్తుందని చెప్పారు.
జీడీపీ వృద్ధి అంచనా 7.3 శాతానికి పెంపు
ఆర్బీఐ తన జీడీపీ వృద్ధి అంచనాను మునుపటి 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2.6 శాతం నుంచి రెండు శాతానికి తగ్గించింది. ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ నెల వరకు నాలుగుసార్లు రేట్లను తగ్గించింది. అప్పటి నుంచి మొత్తం తగ్గింపు 125 బేసిస్ పాయింట్లు ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
ఆగస్టు, అక్టోబరులో రేట్లను మార్చలేదు. ఈ విషయమై క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకీర్తి జోషి మాట్లాడుతూ రెపో రేటు తగ్గింపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. లక్ష్యం కంటే తక్కువగా ఉన్న ద్రవ్యోల్బణానికి ఆర్బీఐ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని మరో ఎకనమిస్టు రాధికా రావు అన్నారు.
