టూరిస్టులకు గుడ్ న్యూస్.. టూరిజం కారిడార్గా కాళేశ్వరం టెంపుల్

టూరిస్టులకు గుడ్ న్యూస్.. టూరిజం కారిడార్గా  కాళేశ్వరం టెంపుల్
  • మాస్టర్​ప్లాన్ తో ఆలయ అభివృద్ధి 
  • రూ. 200 కోట్లు కేటాయింపు 
  • ప్రపోజల్స్ తయారీపై ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్ష
  • స్పీడ్ గా కోటంచ ఆలయ నిర్మాణ పనులు
  •  ప్రారంభానికి  సీఎం రేవంత్​రెడ్డి రాక

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు : 
 గోదావరి తీరాన వెలసిన కాళేశ్వరం టెంపుల్ టూరిజం కారిడార్ గా మారనుంది. ఏటా ముక్తిశ్వర స్వామి సన్నిధిని భారీగా భక్తులు సందర్శిస్తారు. అక్కడి సరస్వతి విగ్రహం, పుష్కర ఘాట్ కూడా ప్రత్యేకం. పుష్కరాలు, పండగల వేళ గోదావరి నది హారతి వేడుకల ను చూసేందుకు లక్షల్లో భక్తులు తరలిస్తారు. దీంతో కాళేశ్వరం టెంపుల్ ప్రాంతాన్ని టూరిజం కారిడార్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వర ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించ నుంది. 

గతంలో సరస్వతి పుష్కరాల సమయంలో కాళేశ్వర ముక్తిశ్వర స్వామిని దర్శించుకు న్న సీఎం రేవంత్​రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 2027లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి కాళేశ్వర క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇటీవల జిల్లా కలెక్టర్ రాహుల్​శర్మ ప్రపోజల్స్ రెడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.  

 పర్యాటకంగా తీర్చిదిద్దే పనులు చేపట్టగా..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న కాళేశ్వరం ఆలయ పరిసరాలు, పాండవుల గుట్టలు, బుగులోని గుట్టలను పర్యాటకంగా తీర్చిదిద్దే పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి.  రూ. 1.5కోట్లతో బుగులో వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్ల నిర్మాణం, పాండవుల గుట్టల సమీపంలోని రాక్​పెయింటింగ్, హరిత హోటల్, చిల్ర్డన్​పార్క్, గుట్టల మీదకు విద్యుత్ ​, తాగునీటి వసతి, అతిథి గృహ నిర్మాణం, రెస్టారెంట్ నిర్మించనున్నారు. 

గుట్టలను అనుకుని ఉన్న ధంసకుంట సమీపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో డేరాలు, రాక్​క్లైంబింగ్​చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. చిట్యాల మండలం నైన్​పాకలోని నాపాక ఆలయాన్ని రూ. కోటి నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. గణపురం మండల కేంద్రంలో ని గణప సముద్రంలో రూ. 3 కోట్లతో లేక్​వ్యూ, అదనపు కాటేజీల నిర్మాణం, జెట్​పాయింట్, స్పీడ్​ బోట్స్, స్టీమర్స్​పనులు, కోటగుళ్లలో రూ. కోటి నిధులతో అభివృద్ధి  పనులు కొనసాగుతున్నాయి.  

కోటంచ క్షేత్రంపై ప్రత్యేక దృష్టి 

కోటంచ లక్ష్మినరసింహస్వామి క్షేత్రాన్ని యాదాద్రి ఆలయం మాదిరిగా మార్చే పనులు స్పీడ్ గా కొనసాగుతు న్నాయి. వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని 2023లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో  సీఎం రేవంత్​రెడ్డి దర్శించుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆలయ అభివృద్ధికి రూ. 12.15 కోట్ల నిధులు మంజూరు చేయించారు. గర్భగుడి నిర్మాణ పనులు, అతిథి గృహం, షాపింగ్​కాంప్లెక్స్, ప్రాకార నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. 

ఆలయం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు రేగొండ మండల కేంద్రం నుంచి అన్ని వైపులా డబుల్ బీటీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. మోడ్రన్ ఏసీ పంక్షన్​హాల్​నిర్మాణం చేపడుతున్నారు. అండర్​ గ్రౌండ్ డ్రైనేజీ  సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. టూరిజం శాఖ నుంచి రూ. 5 కోట్లతో రెస్టారెంట్​, కాటేజీల నిర్మాణం, బ్యూటిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నా యి.  వచ్చే ఫిబ్రవరిలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి ఆలయం సుందరంగా తీర్చిదిద్దే ఏర్పాట్లు స్పీడ్ గా కొనసాగుతున్నాయి. మరో రూ. 15 కోట్లతో ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రపోజల్స్ పంపించారు. 

పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతాం

సహజసిద్ధ పర్యాటక ప్రాంతాలను మరింతగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. పర్యాటకులను ఆకట్టుకునేలా రూపొందిస్తాం. ఇందుకు నిధులు కూడా కేటాయించాం. భవిష్యత్ లో సినిమా షూటింగ్​లు నిర్వహించుకు నేలా నిర్మాణాలు చేస్తాం.  
– గండ్ర సత్యనారాయణరావు, 
భూపాలపల్లి ఎమ్మెల్యే

త్వరలోనే నివేదిక అందిస్తాం 

 గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇటీవలే కాళేశ్వరం ఆలయ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై కలెక్టర్​రాహుల్​శర్మ సమీక్షించారు. దేవాదాయశాఖ తరఫున చేపట్టే పనులపై త్వరలోనే నివేదిక అందజేస్తాం. 
– మహేశ్ కుమార్,
 కాళేశ్వరం ఆలయ ఈవో