తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇండియాకు గుడ్ స్టార్ట్ లభించింది. విశాఖలో జరుగుతున్న మూడో వండేలో తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఫస్ట్ ఓవర్ స్టార్ట్ చేసిన అర్ష్ దీప్ సింగ్.. 5వ బంతిలో వికెట్ తీశాడు.
అర్ష్ దీప్ వేసిన ఔట్ స్వింగ్ బాల్ ను డ్రైవ్ చేయబోయిన రికెల్టన్.. బాల్ స్వింగ్ అవ్వడంతో ఎడ్జ్ కు తగిలి కీపర్ రాహుల్ కు దొరికిపోయింది. 4 బాల్స్ ఆడిన రియాన్ రెకెల్టన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఓపెనర్ రికెల్టన్ ఔట్ అవటంతో కెప్టెన్ టెంబా బవూమా క్రీజులోకి వచ్చాడు.
విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డేలు జరిగితే తొలి వన్డేలో ఇండియా విజయం సాధించింది. రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది.
నిర్ణయాత్మక మూడో వన్డే గెలిచిన వారికి సిరీస్ దక్కుతుందని అందరూ భావిస్తున్న క్రమంలో.. ఇండియా 20 మ్యాచ్ ల తర్వాత టాస్ గెలవటం కలిసొచ్చే అంశం. సొంతగడ్డపై సిరీస్ పోగొట్టుకోకుండా ఉండేందుకు టీమిండియా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా రెండో వన్డే ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మూడో వన్డేలోనూ టీమిండియాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది.
