మూషి తెలివి.. మంచి ఉపాయం.... ఎంతటి ప్రమాదాన్నైనా తప్పిస్తుంది

మూషి తెలివి..  మంచి ఉపాయం.... ఎంతటి ప్రమాదాన్నైనా తప్పిస్తుంది

మూషి అనే ఎలుక చాలా హుషారైనది. అడవంతా సరదాగా తిరిగి, తను నివాసం ఉండే జామ చెట్టు దగ్గరకు వచ్చింది. చెట్టు నుండి రాలిపడ్డ కాయను కడుపార తిని తన బొరియాలోకి వెళ్ళబోయింది. 

“ఆగు మిత్రమా” అంటూ వారించింది చెట్టు పైనున్న ఉడుత.“నేను అలసిపోయాను. నా బొరియలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలి” అని చెప్పింది మూషి. “నీ బొరియలోకి ఇప్పుడే ఒక పెద్ద పాము దూరింది. లోపలికి వెళ్ళావంటే అది నిన్ను మింగేస్తుంది” అని చెప్పింది ఉడుత.

“అవును మూషి మామ! ఎక్కడి నుండో ఒక పాము మన ప్రాంతానికి వచ్చింది. మనలాంటి అల్ప జీవులను వెతికి మరీ తింటోంది. అది నన్నెక్కడ మింగేస్తుందోనని భయంతో చచ్చిపోతున్నా” కలుగు నుండి బయటకు వచ్చి చెప్పింది కప్ప. 

“నువ్వు ఇకపై ఆ బొరియలోకి వెళ్ళకు. మరో బొరియను తవ్వుకుని అందులో నివాసము ఏర్పాటు చేసుకో!” అని మూషికి సలహా ఇచ్చింది అప్పుడే అక్కడకు వచ్చిన చిలుక.“మరో బొరియను తవ్వుకుని అందులో ఉండడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, పాము మన ప్రాంతంలో ఉండడమే మనకు చాలా ప్రమాదం” అని చెప్పింది మూషి.“పామును మన ప్రాంతం నుండి వెళ్లగొట్టడానికి ఏదైనా ఉపాయం ఆలోచిద్దామా?” అని అడిగింది కప్ప. మూషి బాగా ఆలోచించి, స్నేహితులతో చర్చించి ఒక పథకం పన్నింది. 

మూషి జామచెట్టు పైకెక్కి కూర్చుంది. బొరియ నుంచి పాము బయటకు రావడం చూసి, చిలుకకు సైగ చేసింది.“ఏంటి మూషి మామ! అంతలా భయపడుతున్నావు?” అంటూ పాముకు వినబడేలా మూషిని అడిగింది చిలుక.“ఎక్కడి నుండో రెండు ముంగిసలు మన ప్రాంతానికి వచ్చాయి. అవి రెండూ కలిసి మన ప్రాంతంలో ఉన్న ఎలుకలను, కప్పలను, బల్లులను వేటాడి తినేస్తున్నాయి. అవి నన్నెక్కడ పట్టుకుంటాయోనని భయంగా ఉంది. అందుకే చెట్టు దిగి వెళ్ళడానికి నాకు ధైర్యం చాలడంలేదు” చెప్పింది మూషి.

“ముంగిసలు పాములను కూడా తింటాయి కదా!” అన్నది చిలుక.“అవును. ముంగిసలకి పామును వేటాడడం, పాము మాంసం తినడం చాలా ఇష్టం. పాము కనబడితే పట్టుకుని తినేవరకు వదిలిపెట్టవు” అని గట్టిగా చెప్పింది మూషి. 

మూషి మాటలు విన్న పాము కంగారుపడింది. ఒక్క ముంగిసతో పోట్లాడడమే కష్టం. అలాంటిది ఏకంగా రెండు ముంగిసలు ఒకేసారి వస్తే వాటితో పోరాడటానికి తన శక్తి చాలదని లెక్కలు వేసుకుంది. ఇక ఆ ప్రాంతంలో ఉండడం మంచిది కాదని వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. మంచి పథకం పన్ని చిలుక సాయంతో నాటకమాడి పామును ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టిన మూషికి ఉడుత, కప్ప కృతజ్ఞతలు తెలిపాయి. 

-  పేట యుగంధర్ -