IND vs SA: బౌలర్లు సమిష్టి ప్రదర్శన.. తొలి రోజు తడబడి పుంజుకున్న టీమిండియా

IND vs SA: బౌలర్లు సమిష్టి ప్రదర్శన..  తొలి రోజు తడబడి పుంజుకున్న టీమిండియా

గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీంఇండియా బౌలర్లు తడబడి పుంజుకున్నారు. తొలి రెండ్ సెషన్ లలో విఫలమైన బౌలర్లు.. చివరి సెషన్ లో నాలుగు వికెట్లు పడగొట్టి తొలి రోజు ఆధిపత్యం చూపించారు. మరోవైపు సౌతాఫ్రికా కూడా బ్యాటింగ్ లో  రాణించి తొలి రోజును సంతృప్తికరంగా ముగించింది. కెప్టెన్ బవుమా (41), స్టబ్స్ (49) భాగస్వామ్యంతో పాటు ఓపెనర్లు రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. క్రీజ్ లో సేనురన్ ముత్తుసామి (25), కైల్ వెర్రెయిన్(1) ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. జడేజా, సిరాజ్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది.          

రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులతో మూడో సెషన్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభంలోనే కెప్టెన్ బవుమా వికెట్ కోల్పోయింది. 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బవుమాను జడేజా ఔట్ చేసి 84 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు. క్రీజ్ లో పాతుకుపోయిన స్టబ్స్ కాసేపటికే ఔటయ్యాడు. ముల్డర్ కూడా ఔట్ కావడంతో సఫారీలు 201 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో సేనురన్ ముత్తుసామి, టోనీ డి జోర్జీ ఆరో వికెట్ కు 45 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొత్త బంతి తీసుకున్న తర్వాత సిరాజ్ డి జోర్జీని ఔట్ చేయడంతో సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. వెలుతురు మందగించడంతో మరో 8 ఓవర్లు ఉండగానే అంపైర్లు మ్యాచ్ ను ముగించారు. ఈ సెషన్ లో సౌతాఫ్రికా 91 పరుగులు జోడించి 4 వికెట్లు కోల్పోయింది.   

తొలి రెండు సెషన్ లోనూ సఫారీలదే హవా:
 
తొలి సెషన్ లో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. టాస్ ఓడిన మన జట్టు తొలి సెషన్ ను పేలవంగా ఆరంభించింది. సౌతాఫ్రికా ఓపెనర్లు భారత బౌలర్లను తొలి సెషన్ లో సమర్ధవంతంగా అడ్డుకోవడంతో టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. 38 పరుగులు చేసిన మార్కరంను బుమ్రా ఔట్ చేసి టీ బ్రేక్ ముందు బ్రేక్ ఇచ్చాడు. తొలి వికెట్ కు సఫారీ ఓపెనర్లు 82 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 

వికెట్ నష్టానికి 82 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభంలోనే ర్యాన్ రికెల్టన్ (32) వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ క్రీజ్ లో పాతుకుపోయిన ఈ సఫారీ ఓపెనర్ ను ఔట్ చేసి తొలి ఓవర్ లోనే బ్రేక్ ఇచ్చాడు. ఈ దశలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ను బవుమా (36), స్టబ్స్ (32) ముందుకు తీసుకెళ్లారు. పరుగులు రాకపోయినా వికెట్ కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో వీరి భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. ఎంత ప్రయత్నించినా వీరి భాగస్వామ్యాన్ని రెండో సెషన్ లో ఇండియా విడగొట్టలేకపోయింది.