లోకోపైలట్​​ లేకుండానే దూసుకెళ్లిన గూడ్స్

లోకోపైలట్​​ లేకుండానే దూసుకెళ్లిన గూడ్స్
  • సుమారు 70 కి.మీ.వెళ్లిన రైలు

జమ్మూ/చంఢీగడ్: లోకో పైలెట్లు లేకుండా నే గూడ్స్ ట్రైన్ దాదాపుగా 70 కి.మీ.లకు పైగా దూసుకెళ్లింది. 53 వ్యాగన్లతో కూడిన ఈ రైలు జమ్మూకాశ్మీర్​లోని కథువా నుంచి పంజాబ్​లోని హోషియాపూర్ జిల్లా వరకు ప్రయాణించింది. ఆదివారం ఉదయం 07.25 నుంచి 09.00 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ ట్రైన్ చిప్ స్టోన్స్ లోడ్ తో జమ్మూ నుంచి పంజాబ్​కు బయలు దేరింది. డ్రైవర్ ఛేంజ్ కోసం కథువా రైల్వే స్టేషన్ లో ఆగింది. 

హ్యాండ్ బ్రేక్ వేయకుండానే లోక్ పైలెట్, అసిస్టెంట్ లోక్ పైలెట్ దిగిపోవడంతో రైలు మెల్లగా పరుగులు తీయడం మొదలు పెట్టింది. రైల్వే ట్రాక్ వాలుగా ఉండటంతో అది వేగాన్ని పుంజుకుని 70కిమీలకు పైగా ప్రయాణించింది. అప్రమత్తమయిన అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నించారు. హోషియాపూర్ జిల్లాలోని ఉంచి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద ఇసుక బస్తాలతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం తలెత్తలేదని అధికారులు తెలిపారు.