
ప్రకృతి ప్రకోపాలు, విలయాల సమయంలో ముందస్తు సూచనలే మనుషుల ప్రాణాలను కాపాడటానికి దోహదపడతాయి. దీనికి ఖచ్చితత్వమైన సాంకేతికత చాలా ముఖ్యం. అయితే ఆధునిక యుగంలో అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ మోషన్ సెన్సార్లను ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంచింది. వీటి ద్వారా భూకంపం రావటానికి మునుపే వార్నింగ్ సిగ్నల్స్ అందిస్తోంది. ఈ టెక్నాలజీపై ఇటీవల జరిపిన అధ్యయనంలో పనితీరు, ఖచ్చితత్వం సెసిమోమీటర్ల మాదిరిగానే ఉందని తేలింది. 2021 నుంచి 2024 మధ్య కాలంలో కంపెనీకి చెందిన ఆండ్రాయిడ్ భూకంపం అలర్ట్స్ వ్యవస్థ 11వేల కంటే ఎక్కువ కంపనలను గుర్తించింది. ఈ సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా 98 దేశాల్లోని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు 12 వందల సార్లు హెచ్చరికలు అందించింది. ప్రస్తుతం 250 కోట్ల మందికి హెచ్చరికలు అందించే స్థాయికి గూగుల్ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచిందని వెల్లడైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు భూకంపాలు పెద్ద సమస్యేనని, అయితే అవి ఎప్పుడు వస్తాయి, ఎంత తీవ్రతతో వస్తాయనే విషయాలను ముందుగా గుర్తించటం నష్టాలను తగ్గిస్తాయని గూగుల్ ప్రతినిధి వెల్లడించారు. కొన్ని నిమిషాలు లేదా సెకన్ల ముందు ప్రజలకు ఈ సమాచారం అందించటం ద్వారా వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రజలకు అవకాశం లభిస్తుందన్నారు.
గడచిన కొన్నేళ్లుగా చైనా, మెక్సికో, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాల్లో భూకంప వార్నింగ్ సిస్టమ్స్ అందుబాటులోకి తీసుకురాబడింది. వీటిలో సెసిమిక్ స్టేషన్లు నిర్మించబడ్డాయి. అయితే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఎక్కువగా భూకంపాలు వచ్చే దేశాల్లో మాత్రమే అక్కడి ప్రభుత్వాలు వ్యవస్థలను కలిగి ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను అలాంటివి అందుబాటులో లేవు. అయితే ప్రస్తుతం గూగుల్ సంస్థ తీసుకొచ్చిన వార్నింగ్ సిస్టమ్ ప్రపంచ నలుమూలల ఉన్న దేశాల ప్రజలను ముందుగానే హెచ్చరించేందుకు దోహదపడుతోందని వెల్లడైంది.
వాస్తవానికి గూగుల్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీల ద్వారా భూకంపానికి ముందు వేగంగా వచ్చే పి-వేవ్స్ గుర్తిస్తాయి. తమ సెన్సార్ నెట్ వర్క్ ద్వారా ప్రమాదం ఎక్కడ రాబోతోంది, దాని తీవ్రత ఎంత, ఎంత దూరం వరకు అది ప్రభావం చూపనుంది వంటి సమాచారాన్ని గ్రహించి ప్రాసెస్ చేసి వేగంగా అక్కడి ప్రజలకు ముందస్తు వార్నింగ్స్ పంపుతుందని కంపెనీ చెప్పింది. దీని పనితీరుపై యూజర్ల అభిప్రాయాన్ని చూస్తే.. 85% మంది తమకు హెచ్చరికలు అందాయని చెప్పారు. వీరిలో 36% మందికి భూకంపం ప్రారంభానికి ముందు.. 28% మందికి భూకంపం సమయంలో.. అలాగే 23% మందికి భూకంపం వచ్చిన తరువాత హెచ్చరికలు అందినట్లు ఫీడ్ బ్యాక్ డేటా వెల్లడించింది.
2023లో టర్కీలో తీవ్రమైన భూకంపం వచ్చిన సమయంలో దాని తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయటంలో గూగుల్ ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ విఫలం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గూగుల్ తన వ్యవస్థలో ఉన్న అల్గారిథం తప్పిదాలను, సాంకేతిక లోపాలను సవరించింది.