
- దాదాపు రూ.వంద కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం
- స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అప్పటి లీడర్లు
- తాజాగా మినీ ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ పై లోకల్ ఎమ్మెల్యే ఫోకస్
- రూ.3.95 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు
- కబ్జాలు తేల్చి పనులు చేపట్టాలంటున్న స్థానికులు
హనుమకొండ, వెలుగు: కాకతీయుల కాలంనాటి గోపాలపూర్ ఊర చెరువు డెవలప్మెంట్ కు ఆక్రమణలే అడ్డంకిగా నిలుస్తున్నాయి. వరంగల్ ట్రై సిటీలో కేయూ-ఫాతిమానగర్ వంద ఫీట్ల రోడ్డును ఆనుకుని ఉండగా, గత ప్రభుత్వాలు తలా ఓతీరుగా అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చాయి. కానీ, లీడర్లు పట్టించుకోక అభివృద్ధి పనులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. దీంతో చుట్టుపక్కల ఆక్రమణలు జరిగి రూ.వంద కోట్లు విలువైన భూమి అన్యాక్రాంతమైంది. తాజాగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు చెరువు బ్యూటిఫికేషన్ కు అడుగులు పడుతుండగా, కబ్జాల వ్యవహారం తేల్చి చెరువును అభివృద్ధి చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మూడు సార్లు శిలాఫలకాలు..
హనుమకొండలోని వంద ఫీట్ల రోడ్డును ఆనుకుని సిటీ ప్రైమ్లొకేషన్లో ఉండటం, హద్దులంటూ ఏమీ లేకపోవడంతో చెరువు చుట్టూరా ఆక్రమణలు జరిగాయి. దీంతో ఈ చెరువును రక్షించాలని స్థానికులు మూడు దశాబ్ధాలుగా డిమాండ్ చేస్తున్నారు. కాగా, 1998లో అప్పటి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ చెరువును 'సరోవర విహార మాలిక'గా డెవలప్ చేసేందుకు శిలాఫలకం వేశారు. ఆ తర్వాత దానిని లైట్ తీసుకోగా, శిల్పారామంగా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా పట్టాలెక్కలేదు. దీంతో ప్రజాతంత్ర ఆలోచన వేదిక అధ్యక్షుడు తుపాకుల దశరథం ఆధ్వర్యంలో స్థానికులు చెరువు రక్షణ కోసం పోరాటం మొదలుపెట్టారు.
ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ గ్రేటర్ వరంగల్ ఎలక్షన్స్ముందు 2021 ఫిబ్రవరి 6న గోపాలపూర్ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు మరో శిలాఫలకం వేశారు. కానీ ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ చెరువు కబ్జాల్లోనే మగ్గుతోంది. చెరువు మొత్తం జీడబ్ల్యూఎంసీ సిబ్బంది వేసే చెత్తతో డంప్యార్డులా మారింది. గుర్రపు డెక్క పేరుకుపోయి చెరువు ఆనవాళ్లు కోల్పోయింది.
రూ.వంద కోట్ల భూమి ఖతం..
కాకతీయుల కాలంలో వరంగల్ నగర సాగు, తాగునీటి అవసరాల కోసం దాదాపు 280కి పైగా గొలుసుకట్టు చెరువులు నిర్మించగా, అందులో గోపాలపూర్ ఊర చెరువు ఒకటి. వరంగల్ ట్రై సిటీ శివారులోని మడికొండ, సోమిడి, వడ్డేపల్లి నుంచి గోపాలపూర్ ఊరచెరువు, సమ్మయ్య నగర్ సౌడు చెరువు ఇలా ఒక్కోటి గొలుసుకట్టుగా ఉండేవి. కానీ సమ్మయ్యనగర్ సౌడు చెరువు ఇప్పటికే కనుమరుగవగా, గోపాలపూర్ ఊర చెరువు కూడా కబ్జా చెరలో చిక్కుకుంది.
ఎవరూ పట్టించుకోకపోవడంతో రూ.కోట్లు విలువ చేసే భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. 1954 సేత్వార్ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 89లో ఈ చెరువు 23.10 ఎకరాల మేర విస్తరించి ఉండగా, ఇప్పుడు అందులో సగం వరకు కబ్జాకు గురైంది. ఇక్కడ గజం స్థలం విలువ రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండగా, మొత్తంగా రూ.వంద కోట్లకుపైగా విలువైన భూమి ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది.
తాజాగా రూ.3.95 కోట్లతో ప్రపోజల్స్..
గత ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో చెరువు మొత్తం కబ్జాలతో నిండిపోగా, వర్షాకాలం వచ్చిందంటే చుట్టుపక్కల కాలనీలు నీళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోనే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాలతో గోపాలపూర్ ఊరచెరువు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆయన ఆదేశాలతో ఇటీవల ఇరిగేషన్ డీఈఈ హర్షవర్ధన్, మున్సిపల్ ఆఫీసర్లు చెరువును పరిశీలించారు. చెరువు సుందీకరణకు రూ.3.9 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. చెరువు బ్యూటిఫికేషన్లో ముందుగా గుర్రపు డెక్క, చెత్తా చెదారం, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించేందుకు మరో రూ.4.9 లక్షలతో ప్రపోజల్స్పెట్టారు.
ఈ మేరకు నాలుగైదు రోజుల్లో గుర్రపు డెక్క, చెత్తాచెదారం తొలగించే పనులు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే వెంటనే డీ సిల్టేషన్ తోపాటు బ్యూటిఫికేషన్వర్క్స్చేపట్టే ఛాన్స్ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా, గోపాలపూర్ ఊరచెరువు డెవలప్మెంట్ కు కబ్జాలే ప్రధాన సమస్యగా మారాయి. ముందు గోపాలపూర్ఊరచెరువులో కబ్జాలు తొలగించడంతోపాటు హద్దులు నిర్ణయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
కబ్జాలు తేల్చి యాక్షన్ తీసుకోవాలి
గోపాలపూర్ ఊర చెరువులో చాలా వరకు కబ్జాలు జరిగాయి. రూ.కోట్లు విలువ చేసే భూమి ఆక్రమణకు గురైంది. అధికారులు ఫిజికల్సర్వే చేపట్టి ముందుగా హద్దులు నిర్ణయించాలి. ఆక్రమణలు గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలి. కబ్జాలు తేలిస్తేనే చెరువు సుందరీకరణ సాధ్యమవుతుంది కాబట్టి, ఆ దిశగా లీడర్లు ఆఫీసర్లు తగిన చొరవ తీసుకోవాలి.
తుపాకుల దశరథం, ప్రజాతంత్ర ఆలోచన వేదిక అధ్యక్షుడు