గోపనపల్లి తండాలో ఐటీ పార్క్​ వద్దు..కాదని మొండిగా ముందుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తం

గోపనపల్లి తండాలో ఐటీ పార్క్​ వద్దు..కాదని మొండిగా ముందుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తం
  • ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ హెచ్చరిక 

బషీర్​బాగ్, వెలుగు: శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి తండాలో ఐటీ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఎస్.రాజు నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ చైర్మన్ రవీంద్ర నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మ నాయక్, హైకోర్టు అడ్వొకేట్ శ్రీనివాస్ రావుతో కలిసి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.

 గోపన్ పల్లి తండా పరిసరాల్లోని 440 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో స్థానికంగా ఉండే లంబాడీలు, గిరిజనుల్లో ఆందోళన, భయం నెలకొందన్నారు. 400 ఏండ్లుగా ఇక్కడి కొండ, కోనల్లో నివసిస్తూ పశు పోషణ , వ్యవసాయం చేసుకుంటున్నట్లు తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూముల్లో వరి, కూరగాయలు, ఆహార పంటలు సాగుచేస్తున్నామన్నారు. ప్రభుత్వం పట్టా పాస్​పుస్తకాలు కూడా జారీ చేసిందన్నారు. 

హైదరాబాద్ సిటీ విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయని, ఒక్కో ఎకరం కోట్లు పలుకుతోందని, కార్పొరేట్​కంపెనీల కన్ను పడిందని చెప్పారు. ఐటీ పార్కు కోసం ఈ భూములను సేకరించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను ఆదేశించడం కరెక్ట్​కాదన్నారు. నిరుపేదలు, లంబాడాలా భూముల జోలికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. కాదని మొండిగా ముందుకు వెళ్తే రాష్ట్రంలోని అన్ని గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.