టాలీవుడ్‌లో కొత్త తరహా కథాంశాలు, విభిన్నమైన టేకింగ్‌తో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ స్వాగతం పలుకుతారు. ఆ కోవకే చెందుతుంది ఈ రోజు (నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'గోపి గాళ్ల గోవా ట్రిప్' . అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రోహిత్, శశి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రాస్తా ఫిల్మ్స్, ఔరా ఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో ఈ 'ఫ్రెష్ ఫీల్' గుడ్ ఫిల్మ్ రూపొందింది.
కథాంశం.. గోవాకు ఎందుకు వెళ్లారు?
గద్వాల్ డిస్ట్రిక్ట్‌లో ఒక మారుమూల గ్రామంలో టెంట్ సామాను షాప్ నడుపుకునే ఇద్దరు యువకులు ఈ కథకు కీలకం. వీరిద్దరి పేర్లు కూడా గోపిలే. తమ జీవితంలో ఒక్కసారైనా గోవా బీచ్ చూడాలని కలలు కనే ఈ ఇద్దరు గోపిలు, అనుకోని పరిస్థితుల్లో గోవాకు బయలుదేరతారు. ఈ రోడ్ ట్రిప్‌లో వారికి తారసపడిన మూడో గోపి ఎవరు? వీరి గోవా ప్రయాణం ఎలా సాగింది? వారు అనుకున్న పనిని సాధించారా? తిరిగి సురక్షితంగా తమ సొంత ఊరు చేరుకున్నారా? అన్న ప్రశ్నలకు తెరపై సమాధానం లభిస్తుంది. కథ పాయింట్ చాలా సరళంగా ఉన్నా, దాన్ని తెరకెక్కించిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది.
డీప్ కనెక్షన్ ఉన్న రోడ్ ట్రావెల్ ఫిల్మ్
'గోపి గాళ్ల గోవా ట్రిప్' కేవలం ఒక సింపుల్ కథ కాదు.. ఇది ఫ్రెష్ టేకింగ్, డీప్ థీమ్ ఉన్న రోడ్ ట్రావెల్ ఫిల్మ్. మొదటి భాగం జెట్ స్పీడ్‌లో సరదాగా సాగిపోగా, ద్వితీయార్థంలో కథనంలో క్లారిటీతో పాటు ఎమోషనల్ డెప్త్ పెరుగుతుంది. సాధారణంగా చూసే రొటీన్ తెలుగు సినిమా ఫార్మాట్‌కు భిన్నంగా, ఇది నెట్‌ఫ్లిక్స్‌లో చూసే ఇండిపెండెంట్ ఇంగ్లీష్ సినిమాను గుర్తు చేస్తుంది. దర్శకులు రోహిత్, శశి షార్ట్ మేకింగ్, షాట్ డివిజన్‌లో తమదైన ప్రత్యేకతను చూపించారు. ముఖ్యంగా, గోవా బీచ్‌లో కూర్చుని ఫ్లూట్ వాయించే దృశ్యం, దాని పక్కనే బ్లూ కలర్‌లో నడుస్తున్న ఆవు సింబాలిజం (కృష్ణుడిని రిఫర్ చేయడం) సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఇది కేవలం ట్రిప్ కాదు, సెల్యులాయిడ్‌పై ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపిస్తుంది.
►ALSO READ | Big Boss 9: బిగ్ బాస్ హౌస్‌లో కుస్తీలు.. కంటెస్టెంట్ కంటికి తీవ్ర గాయం.. ఇంత రఫ్‌గా ఉన్నారేంటిరా?
నటీనటుల పనితీరు
తక్కువ పాత్రలే ఉన్నప్పటికీ, నటీనటులు అద్భుతంగా నటించి తమ పాత్రలకు ప్రాణం పోశారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి , క్యాంప్ శశి తమదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులలో, శశాంక్ సినిమాటోగ్రఫీవర్క్ చాలా బాగుంది. రోడ్ ట్రావెల్ ఫీల్‌ను, గోవా అందాలను ఫ్రెష్‌గా చూపించడంలో ఆయన విజయం సాధించారు. రవి నిడమర్తి సంగీతం కథకు అనుగుణంగా రిఫ్రెషింగ్‌గా ఉందంటున్నారు ప్రేక్షకులు. మొత్తం మీద, ఈ సినిమా టాలీవుడ్ కథకు హాలీవుడ్ మేకింగ్ కలగలిపిన అనుభూతిని ఇస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల నుండి కాస్త భిన్నంగా, కొత్తగా ఏదైనా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ 'గోవా ట్రిప్' ఖచ్చితంగా రిఫ్రెషింగ్‌గా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
